హుజురాబాద్ ఎన్నికల తరువాత ముగ్గురి పేర్లు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. వద్దన్నా కాదన్నా ఔనన్నా కూడా కోడై కూ స్తున్నాయి సోషల్ మీడియాలు. వారే ఈటెల రాజేందర్ , రాజాసింగ్, రఘు నందన్. రాజా సింగ్ కు ఎప్పటి నుంచో తెలంగాణలో వి వాదాస్పద నేతగా మంచి పేరుంది. గోషా మహల్ ఎమ్మెల్యేగా ఆయన తీరే వేరు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన దైన పంథాలో కేసీఆర్ ను తిట్టడంతో ఆయన మీడియాలో హైలెట్ అవుతుంటారు. కాస్త హిందుత్వ వాదం బలమైన ధోరణిలో వినిపించే నాయ కుడిగా, ఫక్తు బీజేపీ బెటాలియన్ కు చెందిన లీడర్ గా మంచి పేరు ఉన్నప్పటికీ కొన్ని సార్లు అతిగా మాట్లాడి అందరితోనూ విమర్శలకు గురి అవుతుంటారు. అయినా కూడా ఆయన అల్లు అర్జున్ రేంజ్ తగ్గేదేలే అంటారు. ఇప్పుడు కూడా ఆయన అలానే ఉంటారు కూడా! కదిపి చూడండి నిప్పుల వాన కురిపిస్తాడు. ఇక మరో లీడర్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్. అస్సలు తనకు సరిపడని భావజాలంతో ఆయన ఎలా పనిచేస్తారన్నది చాలా మందికి డౌట్. కానీ ఆ డౌట్లన్నీ పటాపంచలు చేసి పనిచేశాడు రఘునందన్. రాజా సింగ్ కు ఊరమాస్ ఇమేజ్ ఉంటే, జర్నలిజం బ్యాగ్రౌండ్ ఉన్న రఘునందన్ కు క్లాస్ ఇమేజ్ కాస్త ఎక్కువగానే ఉంది. మాట్లాడే తీరులో కూడా ఎక్కువగా తన మామ కేసీఆర్ నే ఆయన అనుకరిస్తారు కూడా! అసెంబ్లీలో ఓ సందర్భంలో కేసీఆర్ ఆశీస్సులతోనే తాను ఇంతటి వాడినయ్యానని అన్నారు కూడా! ఆ మాట విని కేసీఆర్ నవ్వులు పువ్వులు పూయించారు తన మోములో!
ఆ విధంగా టీఆర్ఎస్ డీఎన్ఏ ఉన్న ఈ లీడర్ ఆర్ఎస్ఎస్ భావోద్వేగాలతో నడిచే పార్టీలో ఇప్పటిదాకా బాగానే నెట్టుకువచ్చారు. తనదైన పంథాలో సమస్యలపై గళం వినిపించారు. కాస్త సున్నిత మనస్తత్వం ఉన్న నేతగానే ఆయనకు పేరున్నా తనకు అన్నం పెట్టిన వామపక్ష వాదాన్ని ఇవాళ ఆయన విమర్శిస్తుండడమే ఆశ్చర్యకరం. రాజకీయం కదా రంగులు మారుస్తుంది అని సర్దుకుపోవాలి. ఇక ఆఖరుగా ఉన్న నేత ఈటెల సర్. సీనియర్ కమ్యూనిస్టు అని కూడా రాద్దాం ఏం కాదు. వామపక్ష భావజాలం ఉన్న ఈ నేత కూడా బీజేపీలో ఎలా ఇమడగలరు అన్న మాట ఒకటి వినిపించింది. ఈయన కూడా సున్నిత మనస్కుడే! మరీ! నోరేసుకుని పడి పోయే రకం కాదు కానీ పొర్లి పొర్లి ఏడ్చే రకం. అదే పెద్ద తలనొప్పి. మొన్నటి వేళ ఆ రకం ఏడుపు పనికివచ్చినా ఇకపై మాత్రం అస్సలు వర్కౌట్ కాదు భయ్యా! ఏదేమైనప్పటికీ బీజేపీ ఇవాళ ఈ ముగ్గురిపైనే ఆశలు పెట్టుకుంది. వీరే తమ బలం అని భావిస్తోంది. అసెంబ్లీలోనూ బయట కూడా వీరు వినిపించే మాటలే ఇవాళ రేపు ఆ పార్టీ బలపడేందుకు ఆలంబన కానున్నాయి.