త్వరలో గ్యాస్ సిలిండర్ పెరుగుతుందా..? ఎన్నికల కోసమే కేంద్రం ఆగిందా..?
హూజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మరో రూ.200 గ్యాస్ ధర పెంచనుందని, దీంతో గ్యాస్ ధర ఏకంగా రూ.1250 వరకు చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచకుండా ఉండాలని హామీ ఇవ్వాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 2001 నుంచి టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు కూడ టీఆర్ఎస్ గెలుస్తుందని, సర్వేలన్ని చెప్పినట్టు వెల్లడించారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటుకు 20వేలు ఇస్తున్నారని బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి రైతులు, దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పాటు పడుతున్నదని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తొలుత రైతు నాగలితోనే ప్రారంభం అయిందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో స్వయంగా బీజేపీ ఎంపీ నడిరోడ్డు మీద వరిధాన్యాన్ని పోసి అంటుపెడుతుండని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నాయకులు ఎందుకు స్పందించరు అని అడిగారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా దేశంలో ఎక్కడ లేదని.. తెలంగాణలో మాత్రమే ఉందని చెప్పారు. అదేవిధంగా తొలుత కల్యాణలక్ష్మీ పథకాన్ని దళితులకే ఇచ్చిందని గుర్తు చేశారు.
బీజేపీ నాయకులు మంత్రి గంగుల కమలాకర్‌ను, నన్ను ఇక్కడ ఏమి పని అని పేర్కొంటున్నారు. మరి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, తరుణ్ చుగ్, మరో కేంద్ర మంత్రులకు ఏమి పని అని ప్రశ్నించారు. భాష రాని వాళ్లతో బీజేపీ ప్రచారం చేస్తే తప్పు కాదు.. మేము రావడం తప్పా అని పేర్కొన్నారు. పేదలను పీల్చిన పార్టీ గెలవాలా..? లేక పేదలకు మేలు చేసే పార్టీ గెలవాలా అని ఓటర్లను అడిగారు. బీజేపీ సబ్సీడీల్లో కోతలు.. పన్నుల్లో వాతలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 7 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నది. కనీసం దేశంలో కోటి ఉద్యోగాలు అయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం అని తెలిసి కొత్త కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ గెలుస్తాడు. గెల్లు గెలిస్తే హూజూరాబాద్ మొత్తం గెలిచినట్టే.. ఒక వ్యక్తి గెలవాలా..? ఒక ప్రాంతం గెలవాలా అని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి అని పేర్కొన్నారు. ఢిల్లీ గెలవాలా..? గల్లీ గెలవాలా..? అని ప్రశ్నించారు.