చంద్ర బాబు దీక్షలో ఆ ముగ్గురి మాటల తూటాలు..!

NAGARJUNA NAKKA
టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో ఆయన ఈ నిరసన చేపట్టారు. చంద్రబాబుకు మద్ధతుగా నేతలు.. కార్యకర్తలు దీక్షా శిభిరానికి వచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అందులో భాగంగానే టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో వైసీపీ చూపిస్తామని అన్నారు. తన భర్త పరిటాల రవిని చంపినప్పుడు కూడా చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే.. ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలని చెప్పారు. తమలో పారేది సీమ రక్తమన్న సునీత.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
మంగళగిరిలో టీడీపీ చేపట్టిన దీక్షలో నారా లోకేశ్ మాట్లాడారు. ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమేనని.. మా కార్యకర్తల గుండెలను గాయపర్చలేరని అన్నారు. దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపిస్తున్నారన్న లోకేశ్.. పోలీసులే లేకుండా వైసీపీ నేతలు బయటకు రావాలన్నారు. ఈ ప్రభుత్వంపై తనపై 11కేసులు పెట్టిందనీ.. తప్పుడు కేసులు పెట్టి పోలీసులు మూల్యం చెల్లించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని అరెస్ట్ లు చేసినా తమను ఆపలేరన్నారు లోకేశ్.
జగన్ కే కాదు.. గాడ్సేకూ అభిమానులున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. తామూ ఉప్పుకారం తింటున్నామని.. తమకూ బీపీ వస్తుందని స్పందించారు. మంత్రి పదవి కోసమే కొడాలి నాని టీడీపీ నేతలను దూషిస్తున్నాడని.. త్వరలో ఆ పదవి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ ఇస్తే వైసీపీకి చెమటలు పట్టిస్తామని.. టీడీపీ గెలవకపోతే పార్టీ కార్యాలయం మూసివేస్తామని సవాల్ విసిరారు. మొత్తానికి చంద్రబాబు దీక్షా వేదికగా ఆ పార్టీ నేతలు చెలరేగిపోయారు. వైసీపీని టార్గెట్ గా చేసుకొని మండిపడ్డారు. చూద్దాం.. ప్రస్తుత పరిణామాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: