మామ ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్ చేసి కోడలు అరాచకం..?

Chakravarthi Kalyan
టెక్నాలజీ.. ఇప్పడు వాడుకున్నోడికి వాడుకున్నంత.. అవును మరి. ఈ టెక్నాలజీ ఆధారంగా మంచి చేయొచ్చు.. చెడు చేయొచ్చు.. సొంత మామకు టెక్నాలజీతో టోపీ పెట్టాలని ప్రయత్నించిందో కోడలు.. మామ మొబైల్‌ ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ చేసి.. దాని ఆధారంగా ఏకంగా డబ్బు, సొమ్ములు కొట్టేసింది. ఆ తర్వాత విచారణలో దొరికిపోయింది.

అసలేం జరిగిందంటే.. కరీంనగర్‌లో ఉంటున్న వైకుంఠానికి నలుగురు సంతానం. ఇద్దరు  కుమారులు, కోడళ్లు కరీంనగర్‌లోని తన వద్దే ఉంటున్నారు. ఇంకో ఇద్దరు  హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కానీ.. ఇంకా ఆస్తలు మాత్రం పంచుకోలేదు. ఉమ్మడి కుటుంబంగానే కొనసాగుతున్నారు. ఇది నచ్చని ఓ కోడలు ఆస్తి పంచాలని కొద్దినెలలుగా గొడవకు దిగుతోంది. ఆస్తులు, నగలు ఉన్నా.. తమకు పంచడం లేదని అత్తమామలపై మనసులో ద్వేషం పెంచుకుంది.

ఎలాగైనా డబ్బు, నగలు కొట్టేయాలని ప్లాన్ చేసింది. తెలివిగా మూడునెలల క్రితం తన మామ ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ చేసింది. అది ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్‌యాప్‌.. ఆ తర్వాతా ఆ యాప్‌ను తన గూగుల్‌డ్రైవ్‌కు అటాచ్ చేసింది. దీంతో అప్పటి నుంచి తన మామ ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కోడలికి వినిపించేవి. దసరాకు బేగంపేటలో ఉన్న కొడుకు రమ్మని వైకుంఠాన్ని ఆహ్వానించాడు.

హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు బీరువా, అల్మారా తాళాలు ఇంట్లోనే పెట్టి రమ్మన్నాడు. అందుకే మామ ఆ తాళాలు ఇంట్లోనే పెట్టాడు. అయితే.. ఆ తాళాలను ఎక్కడ పెట్టిందీ కుమారుడికి ఫోన్‌లో చెప్పాడు. అది కాస్తా కోడలు జాగ్రత్తగా వినింది. అంతే..  అత్తమామలు హైదరాబాద్‌కు వెళ్లగానే  తాళాలు తీసేసుకుంది. బీరువా తెరచి విలువైన నగలు, పత్రాలు దొంగిలించింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు నటించింది. హైదరాబాద్‌ నుంచి తిరిగిన వచ్చిన మామకు బీరువాలో నగలు, ఆస్తి పత్రాలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో అసలు దొంగ కోడలేనని గుర్తించారు. దొంగతనం చేసిన తీరు చూసి పోలీసులు కూడా ముక్కనవేలేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: