సామాన్యులకు మరో షాక్.. ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం..

Deekshitha Reddy
రోజు రోజుకీ పెరిగిపోతున్న ధరలతో సామాన్యుడు అవస్థలు పడుతున్నాడు. కరోనా పుణ్యమా అని.. నిత్యావసరాల ధరలు ఇప్పటికే కొండెక్కాయి. కూరగాయల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కరెంట్ బిల్స్ చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ట్రూ అప్ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెను భారాన్ని ప్రజలపై మోపింది. ఇలా రోజు రోజుకీ పెరిగే ధరలతో సామాన్యుడు బతుకు బండిని భారంగా నడపాల్సివస్తోంది. ఒకటో తేదీ ముగిసిన వారంలోపే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతీరోజూ సామాన్యుడు ధరలతో ఓ చిన్నపాటి యుద్ధమే చేయాల్సివస్తోంది.
ఇలా పెరిగిపోతున్న ధరలు చాలవన్నట్టు ఇప్పుడు మరో బాంబు పడింది.  ఉల్లిపాయల ధరలకు ఇటీవల రెక్కలొచ్చాయి. గత 15 రోజుల క్రితం వరకూ మార్కెట్లో 20 నుంచి 30 రూపాయల మధ్యలో నాణ్యమైన ఉల్లిపాయలు లభించేవి. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 60 రూపాయలు పెడితే గానీ నాణ్యమైన ఉల్లిపాయలు దొరకడం లేదు. అసలే మన జీవితంలో ఉల్లిపాయలు విడదీయరాని భాగంగా మారాయి. ఏ వంట చేసుకున్నా అందులో ఉల్లిపాయలు వేయడం బాగా అలవాటై పోయింది. ఇప్పుడిలా ఉల్లిపాయల ధరలు కూడా పెరగడంతో సామాన్యుడి జేబుకి చిల్లు తప్పడం లేదు.
కరోనా కష్టకాలంలో ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేక కొంతవరకూ ఉల్లిపాయల ధరలు పెరిగిన మాట నిజమే అయినా.. ఆ తరువాత మళ్లీ సాధారణ పరిస్థితులే నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఉల్లి సాగుచేస్తున్న రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో మార్కెట్లోకి సరుకు రావడమే కష్టంగా మారింది. ఒకవేళ సరుకు వచ్చినా.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సప్లై లేదు.. దీంతో సహజంగానే ఉల్లిపంటకు రెక్కలొచ్చాయి. మన రాష్ట్రంలో ఉపయోగించే ఉల్లిలో దాదాపుగా 70 శాతానికిపైగా పక్క రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతుంది. దీనికి తోడు నిల్వ ఉంచిన పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ సమస్య మరీ ఎక్కువైపోతోంది. ఏదిఏమైనా రానున్న రోజుల్లో ఉల్లి ధర మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: