విభజన తర్వాత తెలంగాణ దూకుడు.. జీఎస్డీపీ డబుల్..?
తెలంగాణ అర్థగణాంక శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ జాతీయ సగటు కంటే ఎక్కువగా.. ప్రత్యేకించి దక్షిణాదిలో టాప్ ప్లేస్లో ఉంటోంది. ఓవైపు కరోనా ఇబ్బంది పెడుతున్నా తెలంగాణ మాత్రం వృద్ధి రేటును నమోదు చేసింది. కరోనా సమయంలో దేశ జీడీపీ 3 శాతం తగ్గితే.. తెలంగాణ జీఎస్డీపీ మాత్రం 2.4 శాతం పెరగడం విశేషం. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా అభివృద్ధి, జీడీపీలో తెలంగాణ వాటా.. ఇలా అన్ని అంశాలను నివేదికల్లో వివరించారు.
2015-16 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకూ సగటు వృద్ధిరేటు తెలంగాణలో 11.7 శాతంగా నమోదైంది. ఇది జాతీయస్థాయిలో కేవలం 8.1 శాతం మాత్రమే కావడం విశేషం. అలాగే జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉండటం విశేషం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్డీపీ 93.8 శాతం పెరిగడం ఓ రికార్డుగా చెప్పొచ్చు. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. తెలంగాణ ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అలాగే తలసరి ఆదాయంలో 2014లో దేశంలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. అలాంటిది ఇప్పుడు దేశంలో మూడో స్థానానికి ఎగబాకింది.