ఏపీలో ఉద్యోగులకు ఎంత కష్టం.. జగన్ వింటున్నావా..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనికితోడు విపరీతమైన సంక్షేమ పథకాల భారం.. వీటి ఫలితంగా ఉద్యోగులకు జీతాల చెల్లింపు కూడా సకాలంలో జరగడం లేదు. గతంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటో తారీఖు జీతాలు వస్తాయన్న భద్రత, భరోసా ఉండేవి.. ఇప్పుడు జగన్ హయాంలో అది కరవైందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతమో రామచంద్రా అని అడ్కుకోవ్వాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


ఇక వేతనాల సంగతి ఇలా ఉంటే.. పీఆర్‌సీ, కరవుభత్యం బకాయిల గురించి ఇంకేం మాట్లాడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. మంత్రుల ఇళ్లలో కుక్కలకు పెట్టే బిస్కట్ల నిధులూ ఉద్యోగుల బడ్జెట్‌ నుంచే కేటాయిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇలా.. ఉద్యోగుల బడ్జెట్‌ను ఇతర అవసరాలకు కేటాయించడం  ఎన్నడూ జరగలేదని గుర్తు చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు తమ చేతులతో పింఛన్లు ఇప్పిస్తున్న  మాకే జీతాల్లేకుండా చేయడం దారుణమని వారు అంటున్నారు.


చివరకు.. పదో తేదీ వచ్చినా పింఛన్లు, జీతాలు అందనివారున్నారట. పోనీ.. ఈ విషయంపై ఎవరినైనా అడుగుదామంటే.. ఆర్థికశాఖ సమాధానం చెప్పే పరిస్థితి లేదట. సచివాలయానికి వెళ్తే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, అధికారులు ఎస్‌ఎస్‌ రావత్‌, సత్యనారాయణ కనిపించట్లేదట. ఇదీ ఉద్యోగుల ఆవేదన. ప్రభుత్వ ఉద్యోగులే కదా అని చిన్నచూపు చూస్తున్నారని వారు ఫీల్ అవుతున్నారు.


దసరా కానుకగా 11వ పీఆర్‌సీ ప్రకటించాలని.. డీఏ సహా బకాయిలన్నీ సంక్రాంతిలోగా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. మరి జగన్ వీరి మొర ఆలకిస్తారా.. జీతాలు సకాలంలో చెల్లించే ఏర్పాటు చేస్తారా.. అన్నది చూడాలి. జగన్ స్పందించకపోతే.. ఇన్నాళ్లూ వేర్వేరుగా పోరాడిన తాము కలిసి పోరాడితే ఎలా ఉంటుందో చూపిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. అయితే వారికి అంత ధైర్యం ఉందా.. సీఎంను ఎదిరించే సత్తా ఉందా.. అన్నది సందేహమే.. చూడాలి ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: