అమిత్ షా తో మల్లన్న కుటుంబం భేటీ..

Deekshitha Reddy
తెలంగాణా సీఎం కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడిన తీన్మార్ మల్లన్నను ఓ కేసు విషయంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మల్లన్న నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ పై కూడా కేసీఆర్ ప్రభుత్వం, పలుదఫాలుగా దాడులు చేయించింది. మల్లన్న నోరు నొక్కాలని చాలా గట్టిగానే ప్రయత్నించిందనే చెప్పుకోవాలి. కొద్దిరోజులక్రితం ఛానల్ లో తనిఖీలు చేసి రికార్డులను, హార్డ్ డిస్కులను కూడా సీజ్ చేశారు. దీంతో అప్పట్లో మల్లన్న అనుచరులతో కలిసి ఆందోళన కూడా చేశారు. తనకు సంభందించిన యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాలపై చాలా వీడియోలు చేసి.. కేసీఆర్ పై విమర్శలు సంధించారు. అయితే ఆ తర్వాత వేర్వేరు కేసుల్లో మల్లన్న అరెస్ట్ కావడంతో వ్యవహారం మరింత వేడెక్కింది.

మల్లన్నపై విసిగిపోయిన కేసీఆర్ ప్రభుత్వం.. ఓ కేసులో అరెస్టు చేయించింది. రిమాండుకు కూడా పంపించింది. ఈ నేపథ్యంలో మల్లన్నకు రాజకీయ అండ కావాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ ఆయన ఒంటరిగానే పోరాటం చేశారు. ఆమధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ గా బరిలో దిగి టీఆర్ఎస్ ని ఓడించినంత పనిచేశారు. కానీ మల్లన్నకు ఇప్పుడు పార్టీ అండ కావాల్సి వచ్చింది. ఈ అవసరాన్ని తమకు అనువుగా మార్చుకున్న బీజేపీ నేతలు పావులు కదిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో తీన్మార్ మల్లన్న కుటుంబం భేటీ అయ్యేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి అమిత్ షా తో మల్లన్న కుటుంబ సభ్యులు దాదాపుగా ఇరవై నిముషాలు చర్చించారు. మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని.. విడిపించాలని కోరారు. మల్లన్నపై కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందంటూ ఫిర్యాదు చేశారు.  

ఈ భేటీ వెనుక రాజకీయ కోణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం. దాదాపుగా మల్లన్నపై కేసీఆర్ ప్రభుత్వం పదికిపైగా కేసులు నమోదు చేసింది. ఒకటి తర్వాత ఒకటిగా.. బెయిల్ రాగానే మళ్ళీ ఏదో ఒక కేసులో అరెస్టు చేయిస్తోంది. దీంతో మల్లన్నకు బీజేపీ వంటి పార్టీ మద్దతు అనివార్యంగా మారింది. అందుకే మల్లన్న బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సొంతంగా కేసీఆర్ తో ఎలాగు పోరాడలేనని తెలుసుకున్న మల్లన్న.. బీజేపీలో చేరి, మరింతగా దూకుడు ప్రదర్శించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసిన అనుభవం ఉండటంతో ఇక నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేయాలని నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. మల్లన్న లాంటి హుషారైన వ్యక్తులకోసం గాలమేసి వెదుకుతున్న బీజేపీ ఇప్పుడు ఆయన్ను అవసరానికి అక్కున చేర్చుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: