బతుకమ్మలపై ఓ ఎమ్మెల్యే కారు భీభత్సం..
హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరుకు వచ్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సెంట్రల్ లైటింగ్ లాంచ్ చేశారు. అదేసమయంలో పోచమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న వేణుగోపాల్స్వామి వారి దేవాలయం ఎదురుగా బతుకమ్మ ఆట, పాటలతో ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారని.. బతుకమ్మలను తీయాలని ఎమ్మెల్యే అనుచరులు కొందరూ మహిళలకు సూచించారు. ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను ఆడుకుంటున్నామని, తీసివేయలేమని తేల్చిచెప్పారు. సర్పంచ్ పర్వతగిరి రాజు అక్కడే ఉండి ఒక పక్క నుంచి పోనివ్వాలని తెలిపాడు. అయినా ఎమ్మెల్యే అనుచరులు పోలీసులు పట్టించుకోలేదు.
ఎంతో ఇష్టంగా బతుకమ్మ ఆడుతున్నమహిళలను నెట్టేసి బతుకమ్మల మీదుగా ఎమ్మెల్యే కారు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే కారును గ్రామస్తులు, మహిళలు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన సెగ వినిపించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. పోలీసులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసలు చేపడుతున్న వారిని తోసేశారు. దీంతో కొంతమంది కిందపడిపోయారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. వెంటనే ఆత్మకూరు సీఐ రంజిత్ అదనంగా కొంతమంది పోలీసులను పిలిపించి ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించారు. పండుగ పూట ఓ ప్రజాప్రతినిధి ఇలా చేయడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారికంగా పండుగ జరుపుతుంటే ఓ ఎమ్మెల్యే ఇలా భీభత్సం సృష్టించడం వింతైన విషయమని పలువురు చర్చించుకుంటున్నారు.