జగనోరి ముందడుగు: కమలం పార్టీ ఇంకెంత దిగజారుతుందో ?
మరీ ముఖ్యంగా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న నాయకులు కనిపిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు.. సత్యకుమార్ వంటి జాతీయ నాయకుల నుంచి కన్నా లక్ష్మీనారాయణ, విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు వరకు అందరూ కూడా రోజు యాక్టివ్‌గానే ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ముందస్తు కనుక వస్తే.. బీజేపీ సన్నద్ధత ఎంత? ఏమేరకు పుంజుకుంటారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం దక్కించుకున్న కమల నాథులు.. గత ఎన్నికల్లో ఒంటరి పోరుతో ముందుకు సాగి.. జీరో.. ఫలితం దక్కించుకున్నారు.
ఇక, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల సమరంలోనూ ఎక్కడా తమ ప్రతాపం చూపించలేక పోయారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ.. గెలుస్తామని అనుకున్నా.. డింకీలు తిన్నారు. దీంతో ఇప్పుడు ముందస్తు వస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ సన్నద్ధతపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ కి నాయకులు బాగానే ఉన్నారు.కానీ, క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే నాయకులు , కార్యకర్తల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పుడే ఎన్నికలు రావులే అనే ధోరణితో చాలా మంది నాయకులు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, మాజీ మంత్రి మాణిక్యాలరావు .. కన్నుమూతతో పశ్చిమలో బీజేపీకి పెద్ద లోటు కనిపిస్తోంది.
ఇక, కృష్ణాజిల్లాకు చెందిన.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ జిల్లాలో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు.. టీడీపీ నుంచి వచ్చి.. బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి వంటివారు కేవలం జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు.. ఎన్నికలు వస్తే.. క్షేత్రస్థాయిలో నాయకులను పోగేసుకోవడం.. కార్యకర్తలను సమకూర్చుకోవడం.. వంటివి ఇబ్బందేనని అంటున్నారు. పోనీ.. పొత్తు పార్టీ జనసేనతో ముందుకు వెళ్తామా.. అంటే.. ఈ పొత్తుపై అనేక సందేహాలు ఉన్నాయి. మరోవైపు.. సీనియర్లుగా ఉన్న పురందేశ్వరి వంటివారు కూడా జాతీయ రాజకీయాలపైనే దృస్టి పెట్టారు. దీంతో బీజేపీకి ముందస్తు.. కలసి వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.