ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈరోజు సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై, హత్యకు గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్ర కుటుంబసభ్యులను ఈ రోజు పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయంటూ సీతక్క ఆరోపించారు. వాటివల్లనే ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతున్నాయని సీతక్క మండిపడ్డారు. అభం శుభం తెలియని చిన్నారి నరరూప రాక్షసుడి చేతిలో బలికావడం చాలా బాధను కలిగిస్తుందని సీతక్క అన్నారు. ఆ దుర్మార్గుడికి వెంటనే కఠిన శిక్ష ను విధించాలని సీతక్క డిమాండ్ చేశారు. చిన్న పాపను అలా చేయడం ఎంత దుర్మార్గం అని అన్నారు. వాన్ని బహిరంగంగా ఉరితీయాలని సీతక్క డిమాండ్ చేశారు.
బహిరంగంగా వాణ్ణి ప్రజల ముందుకు తీసుకురావాలని రాళ్లతో కొట్టాలా..ఉరితీయాలా అని అన్నది నిర్ణయించాలని సీతక్క అన్నారు. వాళ్లకు కనీసం కఠిన శిక్షలు ఉండవని..ప్రభుత్వం నైతిక మద్దతు ఇవ్వదని అన్నారు. ఇంటి ముందు నిరసన తెలిపితే బాధితులనే కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు కోత తో ఉన్న కుటుంబ సభ్యులు నిరసన తెలిపితే ఐదు వందల మంది పోలీసులు వచ్చి దుర్మార్గులను కొట్టకుండా చిన్నారి తల్లికే గాయాలు అయ్యేలా ప్రవర్తించారని అన్నారు.
ఐదు వందల మంది పోలీసులు చిన్నారి బాడీ బయటకు వచ్చే వరకు కూడా ఎక్కడ ఉందో కనుక్కోలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ నింధితుడి ఆచూకి తెలియదంటే మనం ఏ లోకంలో ఉన్నామని సీతక్క ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎలాంటి విచారణ జరుగుతోందని సీతక్క అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. వెంటనే బాధితుల కుంటుంబానికి న్యాయం చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. అనంతరం చిన్నారి ఫోటోకు సీతక్క పూలు వేసి నివాళ్లు అర్పించారు. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని సీతక్క హామీ ఇచ్చారు .