బైరెడ్డికి పోటీ ఇచ్చేది ఎవరు...బాబు సెట్ చేస్తారా...
అయితే గతంలో నందికొట్కూరు నియోజకవర్గం బైరెడ్డి ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేది. నందికొట్కూరులో బైరెడ్డి శేషాసాయన రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిలు పలుమార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఈ నియోజకవర్గం ఎప్పుడైతే ఎస్సీ రిజర్వడ్‌గా మారిందో అప్పటినుంచి ఇక్కడ టిడిపి గెలుపు గగనమైపోయింది. పైగా బైరెడ్డి ఫ్యామిలీ సైతం టిడిపికి దూరమైపోయింది. దీంతో బైరెడ్డి రాజశేఖర్ సోదరుడు కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధార్థ్ తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే వైసీపీలో చేరి కీలక నాయకుడుగా ఎదుగుతున్నారు.
ఇప్పుడు నందికొట్కూరు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ్ సపోర్ట్‌తో నియోజకవర్గంలో ఆర్థర్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఇక్కడ వైసీపీ తరుపున ఎవరు నిలబడిన బైరెడ్డి సపోర్ట్ ఉంటే గెలుపు సులువే. ఇలా నందికొట్కూరుని రూల్ చేస్తున్న సిద్ధార్థ్‌ని నిలువరించి ఇక్కడ టిడిపి జెండా ఎగరవేయడం అంత సులువు కాదనే చెప్పొచ్చు.
ఇప్పటికే నియోజకవర్గంలో కీలక నేతలు వైసీపీలోకి జంప్ కొట్టేశారు. మాజీ ఎమ్మెల్యే ఐజయ్య, విక్టర్‌లు వైసీపీలోకి వెళ్లారు. ఇక గత ఎన్నికల్లో టిడిపి తరుపున ఓడిపోయిన బండి జయరాజు...మళ్ళీ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఈ క్రమంలోనే నందికొట్కూరులో బలమైన నాయకుడుని పెట్టాలని అక్కడ టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బైరెడ్డిని ఢీకొట్టాలంటే బలమైన నాయకుడు ఉండాలని అంటున్నారు. మరి చంద్రబాబు, బైరెడ్డిని ఢీకొట్టే నాయకుడుని నందికొట్కూరులో పెడతారేమో చూడాలి.