ఆ నాయకుల గుండెల్లో రైళ్లు... అందుకేనా ?
ప్రస్తుతం గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నది ఒకే ఒక విషయం. అదేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి పనిచేసిన మంత్రులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నాయకులు మొదలైన వారితో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ ఈ సమావేశానికి హాజరు కావాలని ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్లినట్లు సమాచారం. ఈ కార్డ్ లో ముందుగానే ఈ సమావేశం పూర్తిగా రాజకీయ పరమైనది కాదు. కేవలం ఆయనను స్మరించుకోవడం కోసమే అన్న అర్ధం వచ్చేలా రాసి ఉందని తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ 2 వ తేదీన వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈ సమావేశం జరపనున్నారట.
అయితే దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఈ సమావేశం ఉద్దేశ్యం ఏమిటి? విజయమ్మ ఎప్పుడూ ఇలాంటి సమావేశాలు నిర్వహించలేదు కదా? కొత్తగా ఏంటి? అంటూ పలు ప్రశ్నలు నేతల మదిలో మెదులుతూ ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్ తో పని చేసిన వారు ఇక్కడ ఏపీలోనూ అలాగే తెలంగాణలోనూ ఉన్నారు. అంతే కాకుండా రాజకీయాల్లో జగన్ మరియు షర్మిల ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్టివ్ గా ఉన్నారు. మరియు ఈ మధ్యన రెండు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చాలా మంది నేతలు వైఎస్సార్ ను దూషించారు. ఇప్పుడు కనుక ఆహ్వానం అందిన వారంతా ఈ సమావేశానికి హాజరైతే ఏమి జరుగుతుందో అని ఆలోచిస్తున్నారట? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ లో ఉన్న వారు వెళ్ళినా... లేదా తెలంగాణలో ఉన్న నాయకులు వెళ్ళినా అధిష్ఠానాలకు ఆగ్రహం కలగక తప్పదు. దీనితో ఆయా నాయకుల గుండెల్లో రైళ్లు పోతున్నాయట.
ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళడం అవసరమా ? అని డైలమాలో పడ్డారట. దీనితో అసలు ఈ సమావేశం జరిగినా ఎంత మంది వెళతారు అన్నది సందేహమే. అసలు ఈ సమావేశం అజెండా ఏమిటి అన్న వివరాలు తెలియాలంటే మరి రెండు రోజులు గాక తప్పదు. ఈ సమావేశం వెనుక అన్నాచెల్లెళ్ల పాత్ర ఏమైనా ఉందా ? ఏ సమావేశానికి జగన్ షర్మిల వెళ్లనున్నారు అన్న వివరాలు వెల్లడి కాలేదు.