ఈ ఎమర్జెన్సీ వ్యాక్సిన్.. ఎన్ని డోసులు తీసుకోవాలంటే..!

NAGARJUNA NAKKA
గుజరాత్ కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. దీనిపై సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇక వ్యాక్సిన్ ధరను వచ్చే వారం ప్రకటించనున్నారు. 66శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ పనిచేస్తుందంటున్నారు. 0-28-56 రోజుల వ్యవధిలో మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 12ఏళ్లు పైబడిన వారు ఈ టీకా తీసుకోవచ్చు. సెప్టెంబ్ మధ్య నుంచి టీకా సరఫరా జరుగనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇక ఇంజెక్షన్ సూది చూడగానే చిన్నపిల్లలు ఆమడ దూరం పారిపోతారు. అయితే ప్రస్తుత కరోనా కాలంలో వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వారి కోసం ఫార్మాజెట్ అనే సాధనం రూపొందించారు. సూది లేకుండా ఇది టీకాను నేరుగా చర్మంలోకి పంపిస్తుంది. త్వరలోనే 12ఏళ్లు దాటిన వారికి జైకోవ్-డి టీకాన ఈ విధంగానే వేయనున్నారు. ఇక ప్రపంచంలోనే డీఎన్ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.

ఇక హైదరాబాద్ లో సోమవారం నుంచి కరోనా టీకాలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. జీహెచ్ఎంసీలో 100శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా.. 10 నుండి 15రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగనుంది. జీహెచ్ఎంసీలోని 4వేల 846కాలనీలు, బస్తీల్లో, కంటోన్మెంట్ పరిధిలోని 360ప్రాంతాల్లో 175వాహనాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా.. టీకాల స్పెషల్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.

మరోవైపు దేశవ్యాప్తంగా గత 24గంటల్లో 17లక్షల 21వేల 205మందికి కరోనా టెస్టులు చేయగా.. 457మందికి పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 3.23కోట్లు దాటింది. 300మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షల 61వేల 340గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 57కోట్ల 61లక్షల 17వేల 350 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.









మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: