బాబోయ్‌ తాలిబన్లు: యువతులను చెక్క పెట్టెల్లో పెట్టి..?

Chakravarthi Kalyan
అఫ్గానిస్తాన్‌లో అనుకున్నదంతా అవుతోంది.. తాలిబన్ల అరాచకం పెచ్చుమీరుతోంది. అబ్బే.. మేం పాత తరహాలో ఉండం.. ప్రజలందరికీ సామూహిక క్షమాభిక్ష పెడుతున్నాం.. ఇక ఎవరి పనులు వారు చేసుకోవచ్చు.. మహిళలకు కూడా షరియా నిబంధనలకు లోబడి.. స్వేచ్ఛ ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మారిపోతున్నాయి. స్త్రీల హక్కులు గౌరవిస్తామని.. వారిని వారి పనులు చేసుకోనిస్తామని చెప్పిన మాటలు ఏమీ అమలు కావడం లేదు.


అంతే కాదు.. పాత తాలిబన్ల రాజ్యం వచ్చేసింది. అరాచక పాలన తాలూకు ఆనవాళ్లు అప్పుడే బయటపడుతున్నాయి. ప్రత్యేకించి మహిళల విషయంలో తాలిబన్ల పాత వైఖరి మళ్లీ కనిపిస్తోంది. మహిళలు అంటే బానిసలు.. మహిళలు అంటే మగాడి కోసం ఉన్న జీవులు.. మహిళలు అంటే మగాడి ఆట వస్తువులు అన్న వాళ్ల పాత భావజాలానికి అనుగుణంగానే తాలిబన్ల కొత్త రాజ్యం కూడా నడుస్తోందన్న విషయాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి.


ఈ విషయాలన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయంటే.. అఫ్గానిస్తాన్‌కే చెందిన ఓ మాజీ మహిళా న్యాయమూర్తి తాజాగా స్క్రై న్యూస్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిశాయి. ఆ మాజీ న్యాయమూర్తి అమెరికాలోనే ఉంటోంది. ఆమె తనకు వచ్చిన సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె మాటలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. సరిగ్గా వంట చేయలేదని.. తమకు వండి పెట్టలేదని ఓ మహిళను తాలిబన్ ఫైటర్లు చిత్రహింసలకు గురిచేశారట. ఆ తర్వాత ఏకంగా  ఆ మహిళకు నిప్పు పెట్టారట.


అంతేకాదు.. తమకు వండిపెట్టాలని అక్కడి ప్రజలపై తాలిబన్‌ ఫైటర్లు ఒత్తిడి చేస్తున్నారట. ఇక స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్‌ బానిసలుగా మారుస్తున్నారట. ఈ తంతు కొన్ని నెలలుగా జరుగుతోందట. ఆ మహిళలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారట. వారిని తాలిబన్ ఫైటర్లు బలవంతంగా వివాహం చేసుకుంటారని.. సెక్స్ బానిసలుగా మారుస్తారని సదరు మహిళా న్యాయమూర్తి వాపోయారు. ఈ మాటలు వింటే.. ఇక ముందు ముందు మరెన్ని అరాచకాలు జరగబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: