జగన్‌ నోట ఈసారి ఆ మాట వినిపించలేదే..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఇవాళ విజయవాడలో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేశారు.. రెండేళ్ల తన ప్రభుత్వ పాలనలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడిందని చెప్పుకొచ్చారు. తన సర్కారు చేసిన గొప్ప పనుల గురించి ఘనంగా చెప్పుకున్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సమానత్వానికి ఆచరణలో అర్థం చెబుతూ ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. ఇందులో కొత్తేమీ లేదు. ఇలాంటి వేదికలపై ముఖ్యమంత్రులు ఇవే చెబుతుంటారు.


అయితే.. ఈ సారి సీఎం జగన్ నోటి నుంచి ఒక ముఖ్యమైన మాట మాత్రం వినిపించలేదు. అదేమిటంటారా.. అదే మూడు రాజధానుల మాట.. 26నెలల పాలనలో ప్రజల ప్రభుత్వంగా ప్రతి ఒక్కటీ చేశామన్నారు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మవిశ్వాసం నింపామని చెప్పుకున్నారు. వ్యవసాయాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకుని ఇప్పటి వరకూ 80వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేశామన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవల్లో దేశంలోనే  కొత్త విప్లవం తెచ్చామని చెప్పుకున్నారు.


ఇన్ని చెప్పుకున్నా.. కీలకమైన మూడు రాజధానుల అంశం మాత్రం చెప్పలేదు. సహజంగా జగన్ తన మూడు రాజధానుల గురించి తరచూ చెబుతుంటారు. అందులోనూ ఇలాంటి వేడుకల్లో తప్పనిసరిగా చెబుతుంటారు. మరి ఈసారి ఈ అంశం ఎత్తకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. పాపం.. జగన్ మూడు రాజధానుల గురించి ఎంతో కలలు కన్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా తన పట్టు వీడలేదు. ప్రత్యేకించి తెలుగు దేశం అనుకూల మీడియా రెచ్చిపోతుందని తెలిసినా వెనుకడుగు వేయనేలేదు.


కానీ జగన్ ఎంతగా కలలు కన్నాడో ఆ మూడు రాజధానుల అంశం అంతగా ఆలస్యం అవుతోంది. ముందు శాసన మండలిలో ఇబ్బందులు ఎదుర్కొన్న బిల్లు.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి విషయం కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో రాజధాని తరలింపు సాధ్యం కావడం లేదు. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.. అందుకే జగన్ కూడా ఆశలు వదిలేసుకున్నట్టున్నారు.. అందుకే ఈసారి జగన్ ఆ మాట ఎత్తలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: