పెళ్లి కాలేదా..? అయితే మాకు భార్యలుగా మారాల్సిందే..!

NAGARJUNA NAKKA
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అవివాహిత మహిళలను తమ భార్యలుగా మారాలని తాలిబన్లు బలవంతం చేస్తున్నట్టు అమెరికా మీడియా వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని వారిని నిర్బంధిస్తున్నారని చెప్పింది. అటు సామాన్య ప్రజలపై దాడులు చేయడమే కాకుండా లొంకిపోయిన సైనికులను హింసించి చంపుతున్నారని పేర్కొంది. ఈ పరిణామాలు చాలా ఆందోళనకరమని.. యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని తెలిపింది.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే దేశంలోని సగ భాగానికి పైగా తాలిబన్ల ఆధీనంలో ఉండగా.. తాజాగా దేశంలో రెండో అతిపెద్ద నగరం కాందహార్ ను వారు ఆక్రమించేసుకున్నారు. ఇక ఆ దేశ ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్ మరో ప్రావిన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆప్ఘనిస్థాన్ లోని తొమ్మిది ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించారు తాలిబన్లు. భద్రత బలగాలు వారిని నిలువరించలేకపోతున్నాయి.

ఆప్ఘనిస్థాన్ లోని సగ భాగం తాలిబన్ల వశం కావడంతో రాయబారానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. హింసను పక్కనపెడితే అధికారం పంచుకునేందుకు సిద్ధం అని చెప్పినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనపై తాలిబన్ల స్పందన కోసం ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. తాలిబన్ల దూకుడుకు తలొగ్గిన ఆప్ఘాన్ ప్రభుత్వం..మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్ ను కోరింది. అయితే సగానికి పైగా భూభాగం ఆక్రమించుకున్న తాలిబన్లు అందుకు ఒప్పుకుంటారా.. అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే భారతీయ యువతులకు పెళ్లిపేరుతో వల విసిరి వారి కుటుంబ సభ్యులను సంస్థలో చేర్చుకునేందుకు ఉగ్రవాద సంస్థ జమతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ కుట్రపన్నినట్టు ఎన్ఐఏ గుర్తించింది. 2014లో బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల తర్వాత భారత్ లో కొత్త సభ్యుల నియామకం కోసం జేఎంబీ ఈ పద్ధతికి తెరలేపింది. మదర్సాలు నిర్వహిస్తూ యువతులపై పెళ్లి వల విసురుతున్నారని ఎన్ఐఏ గుర్తించింది. మొత్తానికి అటు తాలిబన్లు.. ఇటు ఉగ్రవాదులు.. యువతులను టార్గెట్ చేశారు. ఎలాగైనా వారిని సొంతం చేసుకోవాలని పన్నాగం పన్నుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: