జగన్ రాజధానికి గ్లోబల్ ముప్పు.. 2100 నాటికి విశాఖ మునక.?
ఇదేదో యుగాంతం టైపు సంచలనాల కోసం రాసే వార్త కాదు.. ఈవిషయం చెప్పింది కూడా ఆషామాషీ సంస్థలు కావు.. ప్రపంచ పర్యావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఏడేళ్లకోసారి జరిపే పరిశోధన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్య సమితి నివేదికను పరిశీలించి.. ప్రఖ్యాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. విశ్లేషించి చెప్పిన విషయం ఇది. మరి నాసా ఒక్క విశాఖ గురించే చెప్పిందా అని ఆశ్చర్యపోకండి.. భారత్‌లోని మొత్తం 12 నగరాలు ఈ శతాబ్దం చివరినాటికి సముద్రంలో కలుస్తాయని నాసా విశ్లేషించింది.
అసలు ఇలా ఎందుకు జరుగుతుంది.. విశాఖ ఎందుకు సముద్రంలో కలిసిపోతుంది.. ఇన్నాళ్లూ లేని ముప్పు ఇప్పుడు ఎందుకు ముంచుకొచ్చింది.. ఈ విషయం పరిశీలించాలంటే మనం గ్లోబల్ వార్మింగ్ గురించి తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మానవుడు చేస్తున్న అతి కారణంగా భూగోళం వేడెక్కుతోంది. కర్బన ఉద్గారాల కారణంగా ఈ గ్లోబల్ వార్మింగ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇలా భూగోళం వేడెక్కడం వల్ల మనుషులకు వచ్చిన ముప్పేమీ లేదు.. కానీ.. ధ్రువాల్లో ఉన్న మంచు కొండలు కరిగిపోతాయి. ఆ కారణంగా సముద్రం స్థాయి పెరుగుతుంది. సముద్రం తీరంలో ఉన్న ప్రాంతాలు క్రమంగా మునిగిపోతాయి.
వచ్చే 80 ఏళ్లలో అదే జరగబోతోందట. అలా జరిగే ముప్పు కారణంగా విశాఖపట్నం సహా మరో 12 పట్టణాలు పూర్తిగా నీటమునుగుతాయని నాసా సంస్థ హెచ్చరిస్తోంది. మరి అలా జరగకూడదంటే.. గ్లోబల్ వార్మింగ్ బాగా తగ్గాలి. అదీ విషయం.