ఇక కరోనా టీకాల గుట్టు బయటకు వచ్చేస్తోందా..?

Chakravarthi Kalyan
కరోనా వ్యాక్సినేషన్‌ దేశానికి అత్యవసరమైన అంశం. అయితే ఈ కరోనా వ్యాక్సినేషన్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు టీకాలపై కాదు.. వాటిని పంపిణీ చేస్తున్న కేంద్రం తీరుపైన.. దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్రం కొన్ని రాష్ట్రాలకే ఎక్కువ వ్యాక్సీన్లు పంపిస్తోందని.. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలు ఆరోపణలు కూడా చేశాయి. మరోవైపు గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే భారీగా వ్యాక్సీన్లు పంపిణీ అయ్యాయి. అయితే అసలు ఎన్ని వ్యాక్సీన్లు ఉత్పత్తి అయ్యాయి.. ఏ రాష్ట్రాలకు ఎన్ని టీకాలు పంపారు.. అన్న డేటా మాత్రం విడుదల చేయడం లేదు.


అయితే ఇన్నాళ్లూ గోప్యంగా ఉన్న ఈ అంశం త్వరలోనే బట్టబయలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ డేటా సహా పోస్ట్-వ్యాక్సినేషన్ సమాచారాన్ని బహిరంగపరచాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం టీకా ట్రయల్స్ డేటాను ప్రభుత్వం తప్పక పబ్లిష్ చేయాల్సి ఉంటుందంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది.


ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ లావు నాగేశ్వర రావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ సభ్యులుగా గల ద్విసభ్య ధర్మసనం పిటిషన్‌పై మొదట అనేక సందేహాలు వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ కారణంగా దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై జనంలో అనేక అపోహలు వచ్చే అవకాశముందని సుప్రీంకోర్టు అనుమానించింది. అయితే ఈ పిటిషన్ యాంటీ వ్యాక్సినేషన్‌ కాదని పిటిషనర్‌ తరపు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సమర్థంగా వాదనలు వినిపించారు.


వ్యాక్సిన్‌ డేటా పారదర్శకతను తెలుసుకునేందుకే ధర్మసనం ముందుకు వచ్చినట్లు ప్రశాంత్‌ భూషన్ స్పష్టం చేశారు. టీకా సమాచారాన్ని బహిరంగ పరచటం ద్వారా ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయని.. ఇది కేంద్రానికే మంచిదని వివరించారు. ఆయన వివరణతో ఏకీభవించిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అంటే త్వరలోనే వ్యాక్సీన్ డేటా బయటకు వస్తుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: