హుజూరాబాద్ ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నారా..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉపఎన్నిక వేడి అప్పుడే మొదలైంది. అసలు నోటిఫికేషన్ కూడా రాకముందే రాజకీయ పార్టీల సందడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ఈటల రాజేందర్‌ ను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసింది. ఇక కేసీఆర్‌ అయితే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి కౌశిక్‌ రెడ్డికి వలవేశారు. ఎమ్మెల్సీ ఆశ చూపి పార్టీలోకి లాగేశారు. ఇంకా టీడీపీ నుంచి ఎల్ రమణకు గాలం వేశారు. బీజేపీ నుంచి పెద్దిరెడ్డినీ చక్క బెట్టేశారు. ఇలా కేసీఆర్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.


అంతేనా.. హుజూరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా దళిత బంధు తెస్తున్నారు. ఈ కార్యక్రమం హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. దళిత కుటుంబానికి  ఇంటికి పది లక్షలు ఇవ్వబోతున్నారు. ఇంకా గొర్రెల పంపిణీ కూడా మొదలు పెట్టేశారు. అయితే.. ఇన్ని చేస్తున్నా ఇంకా కేసీఆర్‌కు ఎక్కడో తేడా కొడుతోంది.. ఇంకా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ దే గెలుపని ఆయన ధైర్యంగా చెప్పలేకపోతున్నారా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.


ఎందుకంటే.. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక ఇప్పుడప్పుడే రాకుండా కేసీఆర్ వ్యూహం పన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో మీ రాష్ట్రంలో సంగతేంటని ఈసీ అడిగితే.. అబ్బే ఇప్పుడు ఎన్నికలు వద్దు కరోనా విజృంభిస్తోందని కేసీఆర్ సర్కారు సమాధానం ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలే జరగనప్పుడు ఇక హుజూరాబాద్ ఉపఎన్నికకు ఈసీ అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. వాస్తవానికి తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులే ఉన్నాయి.


గతంలో ఇంతకంటే దారుణంగా పరిస్థితులు ఉన్నప్పుడే నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ సభలు, కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. కానీ.. వీటికి లేని కరోనా ఇబ్బంది హుజూరాబాద్ ఉపఎన్నికకే వస్తుందా.. మరి కేసీఆర్ ఎందుకు ఈ ఎన్నిక ఆలస్యం కావాలని ఆలోచిస్తున్నారు. అంటే నిజంగానే కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నిక అంటే భయపడుతున్నారా.. ఆలోచించాల్సిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: