ఆ నలుగురి విషయంలో చేతులెత్తేసిన చంద్రబాబు ?
అయితే ఆ నలుగురుపై అనర్హత వేటు వేయించే విషయంలో బాబు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఓ వైపు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో అంతా చూస్తూనే ఉన్నారు. రఘురామ వేరే పార్టీ వైపుకు వెళ్ళిపోయినా సరే వైసీపీ వదలకుండా పోరాడుతుంది. వైసీపీ ఎంపీలు రఘురామపై అనర్హత వేటు వేయాలని ఏకంగా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లీ మరీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి వచ్చారు. కానీ టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పక్కాగా వైసీపీ ఎమ్మెల్యేలుగా ముందుకెళుతున్నారు.
అయినా సరే చంద్రబాబు, వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. పైగా ఆ నలుగురి నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు కనిపించడం లేదు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు ఇన్‌చార్జ్‌గా ఉన్నా సరే ఆయన, వంశీ మీద పూర్తిగా తేలిపోతున్నారు. దీంతో గన్నవరంలో టీడీపీ కష్టాల్లోనే ఉంది. అటు చీరాలలో యడం బాలాజీని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఈయన కూడా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు కనిపించడం లేదు. అలాగే గుంటూరు వెస్ట్‌లో కోవెలమూడి రవీంద్రబాబు కూడా పార్టీని నిలబెట్టలేకపోతున్నారు. ఇక విశాఖ సౌత్‌లో టీడీపీకి నాయకుడే లేడు. ఏదేమైనా ఆ నలుగురు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమైనట్లే కనిపిస్తోంది.