
మోడీ ఇలా అడిగాడో లేదో.. జనం కుమ్మేశారుగా..?
అయితే.. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలు విలువైన సూచనలు ఇవ్వాలంటున్నారు మన ప్రధాని మోడీ. ఎందుకో తెలుసా.. మీరు ఇచ్చే సూచనలు ప్రధాని మోదీ తన ప్రసంగంలో వాటిని భాగం చేస్తారట. అంటే ఎర్ర కోట నుంచి ఏం మాట్లాడాలో జనమే నిర్ణయించ వచ్చన్నమాట. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. దేశ ప్రజల ఆలోచనలు ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రతిధ్వనిస్తాయని ప్రధాని కార్యాలయం తెలిపింది.
ఆగస్టు 15న ప్రధాని ఏ ఏ అంశాలపై మాట్లాడాలో సూచించే వారు తమ సూచనలు మై గవ్ డాట్ ఇండియా వెబ్‌సైట్‌లో తెలపవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించబోయే ప్రధాని మోదీ.. తమ ఆలోచనలు పంచుకోవాలని భావిస్తున్నారు. ఇలా ఆయన చేయడం ఇది నాలుగోసారి. ఆయన ఏటా ఆగస్టు 15న తన ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలను వివరిస్తూ వస్తున్నారు.
అయితే ఈసారి పరిస్థితి కాస్త హీట్ గా ఉంది. అందుకే జనం కూడా ఈ ప్రకటన పట్ల వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రధానంగా పెరిగిన పెట్రో ధరలు, పెగాసస్, రఫేల్ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఇంకొందరు సాగు చట్టాల గురించి మాట్లాడాలని కోరుతున్నారు. ఇంకొందరేమో దేశాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా.. ప్రభుత్వ వ్యాక్సినేషన్ వంటి అంశాలపై మాట్లాడాలని అంటున్నారు. మరి ప్రధాని ఏ ఏ అంశాలపై స్పందిస్తారో చూడాలి.