రేవంత్ స్పీడుకు బ్రేక్...రివర్స్ షాక్ తప్పదా!
ఈ క్రమంలోనే రేవంత్ ప్రభావంతో పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధర్మపురి సంజయ్, ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణలతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నేత సామ వెంకటరెడ్డిలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
అయితే ఇంతకాలం ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఈ వలసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయనే చెప్పొచ్చు. రేవంత్ ఎఫెక్ట్‌తోనే ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని గట్టిగానే చెప్పొచ్చు. కానీ ఇక్కడే కాంగ్రెస్ పార్టీతో తలనొప్పి ఉంది. ఇక్కడ ఏ నిర్ణయం జరగాలన్న పార్టీలో సీనియర్ నేతలతో చర్చించాకే ముందుకెళ్లాలి. ఇప్పుడు పార్టీలోకి వేరే పార్టీ నాయకులు రావడం అనే ప్రక్రియ కూడా ఒక కమిటీ ఆధ్వర్యంలో నడవాలని అంటున్నారు.
అంటే ఆ కమిటీ పార్టీలోకి వచ్చే నేతలని స్క్రీనింగ్ చేసి, అంతా ఓకే అనుకుంటేనే పార్టీలోకి తీసుకుంటారట. లేదంటే పక్కనబెట్టేస్తారట. ఈ రకంగా కాంగ్రెస్ ముందుకెళితే వచ్చే నాయకులు కూడా రారని, రివర్స్‌లో షాక్ ఇచ్చి వారు వేరే పార్టీలోకి జంప్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. పోనీ కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉంటే వేరే నాయకుల అవసరం లేదని అనుకోవచ్చని, వీక్‌గా ఉన్నా సరే ఇలా కమిటీలు వేస్తూ వచ్చే నాయకులని ఇబ్బంది పెడితే, వారు ఇంకా వెనక్కిపోతారని కాంగ్రెస్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.