జగన్ వాళ్లను దువ్వుతున్నాడుగా...!
నిజానికి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయటం చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అంశం. ఉద్యోగ సంఘాలు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పటినుండి సీపీఎస్ రద్దుకు పట్టుబడుతున్నాయి. పాదయాత్ర సమయంలో జగన్ ఇదే విషయమై మాట్లాడుతు వైసీపీ అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. అయితే రెండేళ్ళు దాటినా పట్టించుకోలేదు. ఇదే విషయమై ఉద్యోగుల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని జగన్ గుర్తించారు.
అందుకనే సీపీఎస్ విధానం రద్దుకు ఫైల్ పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ప్రకటించారు. పెన్షన్ విషయంలో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న సీపీఎస్ విధానం రద్దుకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని సజ్జల ప్రకటించారు. దీంతో ఉద్యోగుల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది.
నిజానికి సీపీఎస్ విధానం రద్దు చేయమని ఉద్యోగ సంఘాల నేతలు చంద్రబాబును కూడా అడిగారు. వారికి హామీ ఇచ్చినా మళ్ళీ ఆ విషయాన్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయమై కొందరు ఉద్యోగ నేతలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ణు కూడా కలిశారు. ఆయన సీపీఎస్ రద్దుకు సానుకూలంగానే మాట్లాడారు. అయితే పవన్ చేయగలిగిందేమీ లేదు కాబట్టి మళ్ళీ ఎక్కడా ప్రస్తావన తేవటంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగసంఘాల నేతలు చాలాసార్లే ప్రభుత్వాన్ని కలిశారు.
నిజానికి ఏ విషయాన్ని అయినా నానబెట్టడం జగన్ తత్వానికి విరుద్ధం. అయినా సీపీఎస్ రద్దు విషయాన్ని పట్టించుకోకపోవటంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. మొత్తానికి ఆలస్యమైనా ఉద్యోగుల్లోని అసంతృప్తిని జగన్ గుర్తించటంతో సమస్యక తొందరలోనే శుభంకార్డు పడుతుందనే అనుకోవాలి. ఇక మిగిలిన డీఏల చెల్లింపు, పీఆర్సీ అంశాలపైన కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులందరు హ్యాపీ అనే చెప్పాలి.
అధికారంలో ఉన్నపార్టీ ఉద్యోగులతో పెట్టుకుంటే ఎన్నికల్లో ఎంత ఇబ్బందులు పడుతుందో చరిత్ర చెబుతోంది. జగన్ ఆపని చేయడనే ఉద్యోగ సంఘాలు అనుకుంటున్నాయి. కాబట్టి వీలైనంత తొందరలో ఉద్యోగుల డిమాండ్లను జగన్ పరిష్కరిస్తాడనే అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.