కేటీఆర్ కృషి ఫలిస్తే.. దక్షిణాది నిరుద్యోగులకు పండగే..?
ఇప్పుడు ఈ విషయంపై మంత్రి కేటీఆర్ దృష్టిసారించారు. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు కేటీఆర్ ఈ లేఖ రాశారు.
తెలుగు సహా ఇతర భాషల్లోనూ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత విధానంలో ప్రాంతీయ భాషలను అనుమతించకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఉద్యోగాలను పొందలేకపోతున్నారని మంత్రి కేటీఆర్ తన లేఖలో తెలిపారు. ఇటీవల కేంద్ర సాయుధ పోలీసు పోలీసు బలగాల ద్వారా కానిస్టేబుల్ నియామకాలు, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్, అసోం రైఫిల్‌మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో హిందీ, ఇంగ్లీష్‌లోనే పరీక్షలు రాయాలనే రూల్ పెట్టారు.
ఈ విషయాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి నిబంధనల వల్ల హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. అందుకే హిందీ, ఆంగ్లంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ తన లేఖలో కోరారు. జాతీయ స్థాయి నియామకాలకు 12 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమలు కావడం లేదని గుర్తు చేశారు.