జ్యోతుల లైన్లోకి రాకపోతే కష్టమేనా!
గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలా టీడీపీలోకి వెళ్ళినవారు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇక అప్పటినుంచి ఆ టీడీపీ నేతల పరిస్తితి ఘోరంగానే ఉంది. ఈ 23 మందిలో సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ కూడా ఉన్నారు. ప్రస్తుతం జ్యోతులకు కూడా రాజకీయంగా ఏది కలిసిరావడం లేదు.
అసలు జ్యోతుల రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే. 1994, 1999 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరుపున గెలిచారు. 2004లో ఓడిపోయిన జ్యోతుల ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009లో కూడా ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో అటు జంప్ కొట్టేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పి మరీ జ్యోతులని పార్టీలోకి తీసుకున్నారు.
కానీ బాబు ఎలాంటి పదవి ఇవ్వలేదు. అధికారం ఉన్నన్ని రోజులు జ్యోతుల హవా నడిచింది. 2019 ఎన్నికలోచ్చేసరికి జ్యోతులకు మళ్ళీ ఓటమి ఎదురైంది. ఈ ఓటమి తర్వాత జ్యోతుల ఏ మాత్రం పుంజుకోలేకపోతున్నారు. జగ్గంపేటలో పూర్తిగా వైసీపీ హవా నడుస్తోంది. అలా అని ఈయన కూడా టీడీపీలో పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మొన్న ఆ మధ్య చంద్రబాబు ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలని బహిష్కరించారని చెప్పి, టీడీపీ ఉపాధ్యక్షుడు పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. కాకపోతే జ్యోతుల తనయుడు నవీన్ మాత్రం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా బాగానే పనిచేస్తున్నారు.
ఇటు జగ్గంపేటలో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం నవీన్ చూసుకుంటున్నారు. అయితే జ్యోతుల కూడా లైన్లోకి వస్తే టీడీపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుందని తెలుస్తోంది. లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా జ్యోతుల సత్తా చాటలేరు. అయితే జ్యోతుల ఫ్యామిలీ పార్టీ మారిపోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ జ్యోతుల ఫ్యామిలీ పార్టీ మార్పు లేదని తెలుస్తోంది. చూడాలి మరి జగ్గంపేటలో జ్యోతుల ఎప్పటికి పుంజుకుంటారో?