ఆ టీడీపీ నేత కరెక్ట్‌గానే చెప్పారు...లోకేష్ వల్లే ఇబ్బంది..

M N Amaleswara rao

కరోనా మహమ్మారి రెండో వేవ్‌లో దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజులుపైనే ఈ సెకండ్ వేవ్ దేశ ప్రజలకు చుక్కలు చూపించింది. ఇక కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు వరుస పెట్టి లాక్‌డౌన్ విధించుకుంటూ వచ్చాయి. అలాగే విద్యార్ధుల ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని 10, 12వ తరగతి పరీక్షలని రద్దు చేశాయి. అటు కేంద్ర ప్రభుత్వం సైతం పరీక్షలని రద్దు చేసింది.


కానీ ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలని వాయిదా వేసుకుంటూ వెళుతుంది. ఎలాగైనా పరీక్షలని నిర్వహించాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన కూడా జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. విద్యార్ధుల భవిష్యత్ బాగుండాలంటే పరీక్షలు పెట్టాలని అంటుంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పెట్టిన నేపథ్యంలో వచ్చే నెల పరీక్షలు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెబుతున్నారు.


అయితే పరీక్షలని రద్దు చేయాలని టీడీపీ నేత నారా లోకేష్ ఎప్పటినుంచో పోరాడుతున్నారు. టీడీపీకి కాబోయే అధినాయకుడు కాబట్టి, ఇప్పటినుంచే పిల్లలకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో లోకేష్..టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలతో ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ విద్యార్ధులు గానీ, వారి తల్లిదండ్రులు కూడా పరీక్షలు రద్దు చేస్తేనే బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నారు.


కానీ నారా లోకేష్ పోరాటం చేయడం వల్ల జగన్ ప్రభుత్వం పరీక్షలు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని టీడీపీ నేత జవహర్ కూడా చెబుతున్నారు. లోకేష్‌పై పంతంతో రద్దు చేయాల్సిన పరీక్షలని జగన్ ప్రభుత్వం పెట్టడానికి చూస్తుందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే అలాంటి పరిస్థితే కనబడుతోంది. ఇప్పటికిప్పుడు పరీక్షలు రద్దు చేస్తే క్రెడిట్ కాస్త లోకేష్‌కు పోతుంది. అందుకే ప్రభుత్వం పరీక్షలకే మొగ్గు చూపుతుంది. ఒకవేళ లోకేష్ విద్యార్ధుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే జగన్ ప్రభుత్వం పరీక్షలని రద్దు చేసేదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: