తోటకు పిల్లి సుభాష్ బాగానే ప్లస్ అయ్యారుగా...!
తోట త్రిమూర్తులు...పిల్లి సుభాష్ చంద్రబోస్....దశాబ్దాల పాటు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా ఉన్న నాయకులు. రామచంద్రాపురం బరిలో అనేక సార్లు తలపడిన నేతలు. ఒకసారి తోటది పైచేయి అయితే మరొకసారి పిల్లిది పైచేయి అయ్యేది. అలా రాజకీయ ప్రత్యర్ధులుగా తలపడిన నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో సహచరులుగా ముందుకెళుతున్నారు.
పైగా పిల్లి సుభాష్ వల్ల తోటకు రాజకీయంగా బాగా కలిసొచ్చింది. గత ఎన్నికల్లో తోట, రామచంద్రాపురంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక వైసీపీలోకి వచ్చేశారు. అయితే రామచంద్రాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు. దీంతో జగన్, తోటకు మండపేట బాధ్యతలు అప్పగించారు.
అయితే గత ఎన్నికల్లో మండపేటలో పిల్లి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ నేత వేగుళ్ళ జోగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక సుభాష్‌కు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చారు. మండలి రద్దు నేపథ్యంలో ఆ రెండు పదవులకు పిల్లి రాజీనామా చేశారు. దీంతో జగన్, ఆయన్ని రాజ్యసభకు పంపారు. ఇలా పిల్లి రాజ్యసభకు వెళ్ళడంతో తోటకు మండపేట బాధ్యతలు దక్కాయి.
ఇక తోట మండపేటకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న తోట, మండపేటలో టీడీపీకి అనుకూలమైన కాపులని తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో మండపేటలో వైసీపీ కాస్త బలపడింది. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీనే ఎక్కువ సర్పంచ్‌లని గెలుచుకుంది. అలాగే దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేట మున్సిపాలిటీలో సైతం వైసీపీ జెండా ఎగిరేలా చేశారు తోట.
ఇలా మండపేటలో వైసీపీని బలోపేతం చేసిన తోటకు జగన్ ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. గవర్నర్ కోటాలో తోటకు పదవి దక్కింది. ఆయనపై అనేక కేసులు ఉన్నా సరే గవర్నర్‌తో మాట్లాడి మరీ ఎమ్మెల్సీ దక్కేలా చేశారు. అయితే పిల్లి రాజ్యసభకు వెళ్ళడంతోనే తోటకు బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు.