పల్లానే పెద్ద నాయకుడా!

M N Amaleswara rao

ఏపీలో అధికార పార్టీ దెబ్బకు ప్రతిపక్ష నాయకులకు చుక్కలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలామంది టీడీపీ నేతలని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంది. అలాగే పలువురు నాయకులపై కేసులు వచ్చి పడ్డాయి. ఇంకొందరు జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం, విశాఖపట్నంలో టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న పల్లా శ్రీనివాసరావుని టార్గెట్ చేసింది.


అసలు మొదట నుంచి విశాఖలో టీడీపీని వీక్ చేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుసపెట్టి టీడీపీ నేతల టార్గెట్‌గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలువురుపై భూములు కబ్జా చేశారని, చాలాచోట్ల అక్రమ కట్టడాలు నిర్మించారని మాట్లాడుతున్నారు. అందుకే చాలా కాలం నుంచి పలువురు టీడీపీ నేతల అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ వచ్చారు.


అలాగే ఇటీవల పల్లా శ్రీనివాసరావుకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. ఇక ఇప్పుడు పల్లా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములని కబ్జా చేశారని, వాటిపై వైసీపీ ప్రభుత్వం విచారణ చేస్తుందని చెబుతున్నారు. పల్లా ఆక్రమించుకున్న భూములు విలువ దాదాపు 200 కోట్లపైనే ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. అయితే ఇలా వరుసపెట్టి వైసీపీ నేతలు, పల్లాని టార్గెట్ చేయడానికి కారణాలు లేకపోలేదు.


మొన్నటివరకు విశాఖ టీడీపీలో కీలకంగా ఉన్న గంటా శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు. అలాగే వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. సీనియర్ నేత సబ్బం హరి కరోనాతో కన్నుమూశారు. ఇక విశాఖ పార్లమెంట్ పరిధిలో టీడీపీకి ఉన్న పెద్ద నాయకుడు పల్లానే. ఈయన పార్లమెంట్ అధ్యక్షుడుగా టీడీపీని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ 30 డివిజన్లు వరకు గెలుచుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పల్లా దీక్ష చేయడం వల్లే, టీడీపీ ఆ మాత్రం డివిజన్లు గెలుచుకుంది.


అందుకే పల్లాని వైసీపీ టార్గెట్ చేసిందని టాక్. ఇప్పటికే పల్లాని వైసీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. కానీ పల్లా టీడీపీని వీడలేదు. అందుకే తనపై కక్ష సాధిస్తున్నారని పల్లా చెబుతున్నారు. మొత్తానికైతే పల్లాని వైసీపీ వదిలేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: