పీవీకి ఇంకో గిఫ్ట్ రెడీ చేస్తున్న కేసీఆర్..?
మొన్నటికి మొన్న హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నెక్లస్ రోడ్‌కు పీవీ నరసింహారావు మార్గ్ గా పేరు పెట్టింది. అయితే పీవీ స్థాయికి తగినట్టుగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణలోని ఓ జిల్లాకు పీవీ నరసింహారావు పేరు పెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించింది. అయితే అలా చేస్తే కరీంనగర్ జిల్లా పరిధి తగ్గుతుందని, హుజూరాబాద్ అటు కరీంనగర్‌కు, ఇటు వరంగల్‌కు సమీపంలో ఉందన్న కారణంతో ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ఒప్పుకోలేదు.
పీవీకి అటు వరంగల్, ఇటు కరీంనగర్ రెండు ఉమ్మడి జిల్లాలతో అనుబంధం ఉంది. వరంగల్ నగర జిల్లాని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, సైదాపూర్, చిగురుమామిడి మండలాలతో పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు కుదరకపోతే వరంగల్ నగర, వరంగల్ గ్రామీణ, కరీంనగర్, పెద్దపల్లి.. ఈ జిల్లాల్లో ఏదో ఒక దానికి పీవీ పేరు పెట్టాలని కోరుతున్నారు.
పీవీ స్వగ్రామం వంగర వరంగల్ నగర జిల్లా పరిధిలో ఉంది. ఆయన జన్మించిన ఊరు లక్నెపల్లి వరంగల్ రూరల్ జిల్లాలో ఉంది. పీవీ కొంతకాలం మంథని ఎమ్మెల్యేగా ఉన్నారు. అది పెద్దపల్లి జిల్లాలో ఉంది. పీవీ హన్మకొండ ఎంపీగానూ పనిచేశారు. అది వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండేది. ఈ నెల 28న పీవీ జయంతి. అందుకే పీవీ జిల్లాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.