జలీల్‌ని సైడ్ చేస్తారా? ఈ సారి ఛాన్స్ ఎవరికి?

M N Amaleswara rao

విజయవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే నడుస్తుంటాయి. ముఖ్యంగా బెజవాడ తెలుగుదేశం పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు ఎప్పుడు హైలైట్ అవుతుంటాయి. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతల మధ్య రచ్చ జరిగింది. ఎంపీ కేశినేని నాని, సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. బుద్దా వెంకన్న, బోండా ఉమాలు లక్ష్యంగా నాని విరుచుకుపడ్డారు. అటు బోండా, బుద్దాలు సైతం నానిపై ఫైర్ అయ్యారు.


ఇక వీరి రచ్చ వల్ల గెలవాల్సిన విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఓడిపోయింది. ఇలా ఓటమిపాలైన సరే నాయకులు మధ్య సైలెంట్‌గా ఆధిపత్య పోరు నడుస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సీటు విషయంపై రాజకీయం రంజుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. 2014లో ఇక్కడ నుంచి జలీల్ ఖాన్ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, టీడీపీలోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఈ సీటు కోసం నాగుల్ మీరా గట్టిగా ట్రై చేశారు. బుద్దా వర్గానికి చెందిన నాగుల్ మీరాకు టిక్కెట్ దక్కలేదు.


ఇక కేశినేని వర్గానికి చెందిన జలీల్ ఖాన్ కుమార్తె షబానాకు టిక్కెట్ వచ్చింది. అయితే షబానా, వెల్లంపల్లి శ్రీనివాస్‌పై పోటీ చేసి 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తన కుమార్తె ఓటమికి బుద్దా వర్గమే కారణమని జలీల్ గుర్రుగా ఉన్నారు. అటు షబానా ఓడిపోయాక విదేశాలకు వెళ్లిపోయింది. దీంతో వెస్ట్ సీటుపై బుద్దా వర్గం కన్ను మళ్ళీ పడిందని తెలుస్తోంది.


కేశినేనికి చెక్ పెట్టి టిక్కెట్ దక్కించుకోవాలని బుద్దా వర్గం ట్రై చేస్తున్నట్లు సమాచారం. జలీల్‌కు ఎలాగో వయసు అయిపోయింది. షబానా విదేశాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే వెస్ట్‌పై పట్టు దక్కించుకోవడానికి బుద్దా వర్గం చూస్తుంది. అలా అని కేశినేని, బుద్దా వర్గానికి తేలికగా సీటు వెళ్లనివ్వరు. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వెస్ట్‌లో ఛాన్స్ ఎవరికి ఇస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: