కరోనాతో మాజీ సీఎస్‌ మృతి.. భార్య పరిస్థితి విషమం..!

Chakravarthi Kalyan
ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సీఎస్‌గా పని చేసిన ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్  యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఎస్‌వీ ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడింది. ప్రసాద్ దంపతులు యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటుండగానే.. పరిస్థితి విషమించి ప్రసాద్ మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఎస్వీ ప్రసాద్‌ ఇద్దరు కుమారులు కూడా కరోనాకు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఎస్వీ ప్రసాద్ 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఎస్వీ ప్రసాద్‌ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో సీఎస్‌గా సేవలందించారు. చంద్రబాబు సహా పలువురు ముఖ్యమంత్రులు కార్యదర్శిగా పని చేశారు.  ఎస్వీ ప్రసాద్ నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు.

ఎస్వీ ప్రసాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గా కూడా పని చేశారు. ఎస్వీ ప్రసాద్‌ అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. 1975లో ఐఏఎస్‌ గా ఎంపికయ్యాక.. మొదట నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు. 1982 లో కడప జిల్లా కలెక్టర్ గా పని చేశారు. 1985లో విశాఖపట్నం కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆపై పలు శాఖలు, విభాగాలకు ఛైర్మన్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వంటి హోదాల్లో పని చేశారు.

క్రమంగా కేరీర్ చివరి నాటికి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. తనకన్నా 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా ఎస్వీ ప్రసాద్‌నే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. దాదాపు పదేళ్లకు పైగా పదవీకాలంలో ముగ్గురికి పైగా ముఖ్యమంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలందించారు ఎస్వీ ప్రసాద్. జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయడు హయాంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎస్వీ ప్రసాద్.. రోశయ్య హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. రమాకాంత్ రెడ్డి తర్వాత సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: