వాళ్లకు థ్యాంక్స్ చెబుతూ వరుసగా జగన్‌ ట్వీట్లు..!

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ కొందరికి థ్యాంక్స్ చెబుతూ వరుసగా ట్వీట్లు పెట్టారు. ఇంతకీ ఆయన థ్యాంక్స్ చెప్పిందెవరికో తెలుసా.. ముకేశ్ అంబానీకీ, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ యాజమాన్యాలకు జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకంటారా ? కష్టకాలంలో ఏపీకి ఆక్సిజన్ అందించినందుకు జగన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ పంపిస్తున్న సంస్థలకు కృతజ్ఞతలు తెలిపిన జగన్.. కరోనా వేళ అండగా నిలిచారంటూ ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు.
రిలయన్స్‌ ఫౌండేషన్‌, ముకేశ్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపిన జగన్.. భవిష్యత్తులోనూ రిలయన్స్ అండదండలు కొనసాగాలని ఆకాంక్షించారు. టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్స్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్‌.. టాటా స్టీల్‌ ఇప్పటివరకు ఏపీకి వెయ్యి టన్నుల ఆక్సిజన్‌ పంపిందని ట్వీట్‌ లో వివరించారు. రాయలసీమ ప్రాంతానికి సజ్జన్ జిందాల్‌ ఆక్సిజన్ పంపిందని గుర్తు చేసుకున్న జగన్.. రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్‌ను నవీన్ జిందాల్‌ పంపారని సీఎం జగన్‌ అన్నారు.
నిజంగానే.. ఈ సంస్థలు ఏపీలో వందల ప్రాణాలు కాపాడినట్టే చెప్పుకోవాలి. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో చాలామందికి ఆక్సిజన్ అవసరం వచ్చింది. కేంద్రం నుంచి ఆశించినంత మేర ఆక్సిజన్ సరఫరా లేని సమయంలో ఈ సంస్థలు తమ పరిశ్రమల నుంచి ఏపీకి ఆక్సిజన్ అందించాయి. వందల మంది ప్రాణాలు నిలబెట్టాయని చెప్పొచ్చు.
తిరుపతిలో ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ సమయానికి రాలేకపోవడం.. ఏకంగా 11 మందికిపైగా కొవిడ్ రోగుల ఉసురు తీసిన సంగతి తెలిసిందే. కేవలం ఐదంటే ఐదు నిమిషాలు ఆక్సిజన్  ట్యాంకర్ ఆలస్యంగా  రావడం కారణంగా కరోనా రోగులు ఊపిరి ఆగిపోయింది. అంతకుముందు విశాఖలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా ఎంత ముఖ్యమో ఈ ఘటనలు తెలిపాయి. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందిస్తున్న సంస్థలకు సీఎం కృతజ్ఞతలు చెప్పడం ఎంతైనా మెచ్చుకోవాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: