
దమ్ముంటే అలా చేయండి.. ఏబీఎన్ ఆర్కేకు ప్రొ. కె.నాగేశ్వర్ సవాల్..?
ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిల్ వచ్చిన రోజు.. కోర్టులో పరిణామాలను విశ్లేషించిన కె.నాగేశ్వర్.. మీడియాలో మాట్లాడవద్దని రఘురామకు గట్టి ఆదేశాలు ఇచ్చిందని.. ఇది ఒక విధంగా జగన్‌కు గెలుపు అని విశ్లేషించారు. అయితే.. కె. నాగేశ్వర్ సైతం కోర్టు తీర్పును వక్రీకరించారని.. కోర్టు కేవలం ఈ కేసు విషయం వరకే మాట్లాడొద్దని చెప్పిందని.. కానీ నాగేశ్వర్.. అసలు మీడియాతోనే మాట్లాడొద్దని చెప్పిందని ఆర్కే తన కొత్త పలుకులో విమర్శించారు.
తనను తాను తటస్థవాదిగా చెప్పుకొనే ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వాళ్లు కూడా సుప్రీంకోర్టు విధించిన షరతులకు వక్రభాష్యం చెప్పారని ఆర్కే అన్నారు. వాస్తవాలను మరుగుపరచడానికి ప్రయత్నించే వారితో ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు కూడా శ్రుతి కలపడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీపీఎం సానుభూతిపరుడైన నాగేశ్వర్ తటస్థవాది ఎలా అవుతారు? ఆయన మమ్మల్ని నిందించినట్టుగా మేం ఆయనను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షపాతి అంటే అంగీకరిస్తారా? ఆయన అంగీకరిస్తే మేం కూడా అంగీకరిస్తాం... అంటూ ఆర్కే రాసుకొచ్చారు.
ఆర్కే కొత్త పలుకుపై కె. నాగేశ్వర్ కూడా స్పందించారు. తన విశ్లేషణకు కట్టుబడి ఉన్నానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఈ కేసు అంటే.. ఏపీ రాజకీయాలన్నీ వస్తాయన్నారు. అలా కాదని ఆర్కే భావిస్తే.. ఓ పని చేయాలని కె. నాగేశ్వర్ సలహా ఇచ్చారు. రఘురామకృష్ణ రాజు విడదలయ్యాక.. ఏబీఎన్ ఛానల్‌లో డిస్కషన్‌కు పిలిచి.. ఏపీ రాజకీయాలపై గతంలో విమర్శించినట్టే మరోసారి విమర్శించేలా చేయమని ఆర్కేకు సవాల్ విసిరారు. అలా చేస్తే.. అప్పుడు సుప్రీంకోర్టు స్పందించకపోతే... తాను కూడా తన విశ్లేషణలో తప్పుందని అంగీకరిస్తానని చెప్పారు. ఇది ఒక విధంగా ఆర్కేను సవాల్ చేయడమే. మరి ఈ సవాల్‌ను ఆర్కే స్వీకరిస్తారా.. చూడాలి.. మరి.