ఆనందయ్య ఆయుర్వేద మందుపై టీవీ9 రజనీకాంత్‌ ఫైర్..?

Chakravarthi Kalyan
ఎందుకో తెలియదు కానీ.. కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై టీవీ9 నెగిటివ్ ప్రచారం డోస్ పెంచుతోంది. ఫ్రీగా ఇస్తే మంచి మందై పోతుందా..? అనుమతి లేని నాటు వైద్యం కరెక్టేనా? అంటూ ప్రచారం చేస్తోంది. టీవీ9 మేనేజింగ్ ర‌జినీకాంత్ ఈ అంశంపై ఓ సుదీర్ఘ వ్యాసమే రాశారు. ఆయన ఏమంటున్నారంటే..
“ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. లాభాపేక్ష లేదు. అనువంశికంగా సాంప్రదాయ వైద్యాన్ని ప్రజలకు ఇస్తూ వస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా లేనిది ఏదైనా నేరుగా వైద్యం అనడానికి వీలు లేదు. అనందయ్య చేస్తున్న నాటు వైద్యానికి కూడా ఆయుష్ అనుమతి వస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారతదేశ పౌరులకు చట్టాలు, నిబంధలకు లోబడి మాత్రమే ఈ వైద్యాన్ని అందించాలి. తరాలుగా అనువంశికంగా ఇస్తున్నదైనా…సరైన శాస్త్రీయ పరిశీనలత తర్వాత అనుమతులు ఉంటేనే జనబాహుళ్యనికి అందించాలి.

ఆనందయ్య మందు ప్రీగా ఇస్తున్నాడంటే నమ్మేద్దామా? ప్రీగా ఇస్తే అది వైద్యం అవుతుందా? అజ్ఞానంతో కూడిన నమ్మకాన్ని విశ్వసిద్దామా? శాస్త్రీయతతో కూడిన అనుమతులతో కూడిన వైద్యాన్ని నమ్ముదామా? అనే చర్చ జరుగుతోంది. సంప్రదాయ వైద్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. సంప్రదాయ వైద్యాలైన ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియో, ఎలక్ట్రో హోమియోను ప్రోత్సహిస్తోంది. వాటికి కేంద్ర ఆయుష్ అనుమతి తప్పనిసరి. అసలు నాటు వైద్యాన్ని ఆయుష్ అనుమతించదు. సాంప్రదాయాన్ని నమ్మే ఆయుష్ అనుమతించని దాన్ని మనం గుడ్డిగా నమ్మి ఎలా ముందుకెళతాం.

ప్రీగా ఇస్తున్నారు. తగ్గిందనే ప్రచారంతో కూడిన నమ్మకం. ఈ క్రైటీరియాతో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామా..బాగు చేసుకుంటామా..ఇదే క్రైటీరియా తీసుకుంటే ఇక రీసెర్స్ ఎందుకు? క్లినికల్ ట్రైయిల్స్ ఎందుకు? ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఎందుకు? దేశంలో వంద మందినో లేక వేల మంది నాటు వైద్యులను పెట్టుకుంటే సరిపోతుందనేది విమర్శకుల మాట. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన వ్యవహరించ వద్దనే వాదన ఉంది. గుడ్డిగా నాటు మందును నమ్మడమంటే ఇంటి దీపమని ముద్దుపెట్టుకుని మీసాలు కాల్చుకోవడమే అవుతుంది.

ఫ్రీగా వైద్యం అందిస్తే మంచి మందు అనే నమ్మకం సరైంది కాదు. కొందరు నమ్మితే అది వైద్యం కిందకు రాదు. ఆ వైద్యానికి శాస్త్రీయత ఉండాలి. ఎంతో రీసెర్చ్ జరగాలి. ఇందుకు భారత్‌లో ఆయుష్ అనుమతులు ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి శాస్త్రీయత, చట్టబద్దత ఉంటోంది. అలాంటి వాటిని మాత్రమే మనం మందుల కింద కన్సిడర్ చేస్తాం. ప్రపంచ వ్యాప్తంగా అల్లోపతిలో చాలా పెద్ద రీసెర్స్ జరిగింది. మానవ శరీరానికి సంబంధించి అణువు అణువు శోధించి రోగాలకు సంబంధించిన మందులు కనిపెడుతున్నారు. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు కావాల్సిందే. అనుమతులు లేనివి మందులు కావు.

ఆనందయ్య నాటు మందు విషయంలో కొందరు అధికార, విపక్ష నేతల వైఖరి భిన్నంగా ఉండటం ఊహించగలిగినదే. కందకు లేని దురద కత్తి పీటకెందుకని ఎవరైనా ప్రశ్నిస్తే నా జవాబు..శాస్త్రీయత, సహేతుకత, జవాబుదారీతనంపై ప్రశ్నించడం టీవీ9 నైజం. మెరుగైన సమాజమే టీవీ9 లక్ష్యం.

- వి. ర‌జినీకాంత్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిట‌ర్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: