ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు వద్దు - సీఎం జగన్..

Deekshitha Reddy
భారత్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేటు ఆస్పత్రులకు కూడా చోటిచ్చే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీఎం జగన్, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా రేట్లను భారీగా పెంచేసి దోపీడీ చేస్తున్నారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీలైతే ఉచితంగా లేదా నామమాత్రపు ధరలకే కొవిడ్ టీకా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఏపీలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించామని…అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌ల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నామని లేఖలో వివరించారు జగన్. ప్రైవేటు ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్‌ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోందని చెప్పారు. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్‌ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసలుబాటు ఉండటం కూడా సరికాదన్నారు. ఇలాంటి వెసులుబాటుతో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం ప్రభుత్వాలపై విమర్శలకు కారణం అవుతోందన్నారు జగన్.

45 ఏళ్లు దాటిన వారికే రెండు డోసులు అందుబాటులో లేని ఈ సమయంలో 18ఏళ్లు నిండినవారికి టీకా వ్యవహారం మరికొన్ని నెలలు ఆలస్యం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం, టీకా కొరతతో ఇలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్‌ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదని ఆయన చెప్పారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవిడ్‌ వాక్సిన్‌ డోస్‌ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలని, అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్‌ డోస్‌ లు వేసే వీలు కలుగుతుందన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధించాలని సీఎం జగన్ తాను రాసిన లేఖలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: