కుప్పం ప్రజలకు శుభవార్త ... చంద్రబాబు కొండంత అండ ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతుండడంతో వైద్య సదుపాయాల కొరత ఎక్కువయింది. ఆక్సిజన్ అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి ఈ కరోనా కష్ట సమయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఏకంగా కోటి రూపాయలు సహాయం చేసి ప్రజలకు తన వంతు సాయం చేశారు. శుక్రవారం నాడు కుప్పంలోని తన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రన్న మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోని ప్రభుత్వాసుపత్రిలో వెనువెంటనే వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని, సిబ్బందిని పెంచాలని, మెరుపు వేగంతో ఆసుపత్రి యాజమాన్యం కొత్త సిబ్బందిని నియమించాలని, కొరత ఉన్న కరోనాకు వినియోగించే మందులు కొనాలని పేర్కొన్నారు. దీనికయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని, అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాదు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ప్రజలకు రాకూడదని కుప్పం ఆస్పత్రిలో 35 లక్షల తో ఆక్సిజన్ ప్లాంట్ ను సొంత ఖర్చుతో అతి త్వరలో నిర్మిస్తానని తెలిపారు. అదే విధంగా కుప్పంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకేషనల్ జూనియర్ కాలేజీ నూతన భవనంలో 200 పడకలతో కూడిన ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేయాలని ఇందుకోసం జిల్లా కలెక్టర్ కు లేఖ  రాస్తానని పేర్కొన్నారు. అలాగే కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలోని మొదటి అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా  ఆక్సిజన్ సరఫరా  అయ్యే విధంగా వెంటనే మరమ్మతులు చేసి ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంతే కాకుండా నేడు అనగా శనివారం నాడు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరయినన్ని ఆక్సి మీటర్లను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందజేస్తామని తెలిపారు. అలాగే ట్రస్టు ద్వారా అందుతున్న ఆహార పంపిణీ, మెడిసిన్ లాంటివి మరింత ఎక్కువ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కుప్పం ప్రజలు భయాందోళనకు లోనుకావద్దని జాగ్రత్తగా ఉండండి అంటూ ధైర్యం చెప్పారు. ఇలా తన సొంత నియోజకవర్గానికి దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే వైద్య సదుపాయాలను వెంటనే సమకూరుస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. దీనిపట్ల కుప్పం ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: