కొవిడ్ కుమ్మేస్తున్నా.. ఆ పనులు మాత్రం అస్సలు ఆగడం లేదట..!?
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయట. వైయస్ జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేపడుతోందట. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు, అవకతవకలు సరిచేస్తూ తమ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోందని చెబుతున్నారు. వేలాది మంది కార్మికుల శ్రమైక్య సౌందర్యంతో పాటు ఆధునిక యంత్ర సామగ్రి, వేలాది టిప్పర్లు, లారీలు, యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య ఓ ప్రపంచ అద్భుత నిర్మాణంగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందట.
కరోనా ఉన్నా.. వందలాది మంది నిపుణులు, ఇంజనీర్లు పర్యవేక్షణలో పనులు పరుగులు పెడుతున్నాయట. గత ప్రభుత్వాలు మాటలకు, గ్రాఫిక్స్ కే పరిమితమైతే, సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లుగా ప్రాజెక్టు పనులను చేతల్లో చూపిస్తున్నారట. వరదలు వచ్చినా, కరోనా కలవర పెడుతున్నా పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం రెట్టింపు వేగంతో కొనసాగుతున్నాయట. మేఘా ఇంజనీరింగ్ సంస్థ పక్కా ప్రణాళికకు తోడు రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల సహకారంతో నిర్మాణం అంచనాలను తలకిందులు చేస్తూ యుద్ధప్రాతిపతికన పనులు జరుగుతున్నాయట.
చంద్రబాబు పోలవరాన్ని సోమవారంగా మార్చాను అని మొండి గోడలకు పరిమితం చేశాడని జగన్ సర్కారు విమర్శిస్తోంది. కానీ.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆంధ్రుల జీవనాడి తమ లక్ష్యంగా పనులు చేయిస్తోందట. మొత్తానికి ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం తాము బ్రహ్మాండంగా పనులు చేయిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అసలు వాస్తవం కూడా ప్రజలకు తెలుస్తుందిగా.