నేడే 5 రాష్ట్రాల కౌంటింగ్... బెంగాల్‌, తమిళనాడుపైనే ఉత్కంఠ..!?

Chakravarthi Kalyan
ఇవాళ ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. బెంగాల్‌, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో మొదలు కాబోతోంది. ఇవాళే  తిరుపతి ఎంపీ సీటు, నాగార్జునసాగర్‌  అసెంబ్లీ సీటుకు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ కాబోతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపుతో మధ్యాహ్నానికి ఫలితాలపై ఓ అంచనా వచ్చేస్తుంది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అందరి కళ్లు బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.

బెంగాల్ విషయానికి వస్తే.. బెంగాల్‌లో మొత్తం 294 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 294 స్థానాలున్న బంగాల్‌లో మ్యాజిక్‌ మార్కు 148.. ఈ స్కోరు వచ్చిన పార్టీదే అధికారం.. ఇక్కడ ప్రదానంగా తృణమూల్‌, బీజేపీ మధ్యేనే ప్రధాన పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో  వామపక్షాలు, కాంగ్రెస్‌, ఐఎస్‌ఎఫ్‌ కూటమిగా పోటీ చేశారు. అయినా వీటి ప్రభావంపై పెద్దగా అంచనాలు లేవు. తనకు ప్రతి విషయంలోనూ పంటి కింద రాయిగా మారుతున్న మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని మోడీ టీమ్ అనేక ప్రయత్నాలు చేసింది. మరి అవి ఫలించాయా.. లేదా అన్నది మరికొన్ని గంటల్లోనే తేలబోతోంది.  

మరో ఆసక్తికరమైన పోరు తమిళనాడులో జరిగింది. ఇక్కడ మొత్తం 234 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 234 స్థానాలున్న తమిళనాడులో మ్యాజిక్‌ మార్కు 118గా ఉంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇప్పటికే రెండు సార్లు అధికారం దక్కించుకున్న అన్నాడీఎంకే.. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది. కానీ..ఈసారి తమిళనాడులో పీఠం తమదేనని డీఎంకే కూటమి ధీమాగా ఉంది.

అయితే తమిళనాట బరిలో ఉన్న కమల్ హాసన్ పార్టీ ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. కమల్ కు చెందిన పార్టీ మక్కళ్‌ నీది మయ్యం తొలిసారి బరిలో దిగింది. మొదటిసారి జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన ఎన్నికలు ఇవి. మరోవైపు అనూహ్యంగా రజినీకాంత్, శశికళ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఎక్కువ శాతం అవకాశాలు మాత్రం డీఎంకే కే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: