వీళ్లు చాలా గ్రేట్.. కరోనా రక్కసికి కళ్లెం వేసేశారు..!

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌ లో శరవేగంగా వ్యాపిస్తోంది. వ్యాధిని గుర్తించేలోపే ప్రాణాల మీదకు వస్తోంది. వైరస్ సోకిన వారం రోజుల్లోనే రోగి పరిస్థితి సీరియస్ అవుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో కుమురం భీమ్‌ జిల్లాలోని ఐదు గ్రామాల వారు కరోనాకు భలేగా కళ్లెం వేసేశారు. ఊరికో వంద మందికి కరోనా సోకినా.. భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనాను కట్టడి చేశారు. ఐదు గ్రామాల్లో ఒక్కరు కూడా ప్రాణం పోకుండా జాగ్రత్తపడ్డారు.

మరి ఈ విజయం వీరికి ఎలా సాధ్యమైంది.. కరోనాను కట్టడి చేసేందుకు వీరు ఏం చేశారు.. చూద్దాం.. కుమురం భీం జిల్లా లింగాపూర్‌ మండలంలోని ఐదు గ్రామాలను ఇటీవల కరోనా కలవర పరిచింది. మొదట మోతీపటార్‌ గ్రామంలో కరోనా జాడ కనిపించింది. ఇక్కడ మార్చి 28న హోలీ పండగను ఘనంగా  చేసుకున్నారు. చుట్టుపక్కల నుంచి 700 వందల మంది తరలివచ్చారు. ఈ నెల 5న మోతీపటార్‌ పక్క గ్రామమైన కొత్తపల్లిలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వచ్చింది.

ఆ తర్వాత మరికొందరికి వ్యాధి నిర్థరణ అయ్యింది. దీంతో అధికారులు  వైద్య శిబిరం నిర్వహించి సామూహికంగా పరీక్షలు చేస్తే మొత్తంగా  132 కేసులు తేలాయి. జాతర విషయం తెలిసి.. చుట్టుపక్కల గ్రామాల్లోనూ పరీక్షలు చేస్తే.. ఏకంగా  405 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు మరింతగా అలర్ట్ అయ్యారు. ప్రతి గ్రామంలో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. గ్రామస్థులెవరూ  బయటకు రాకుండా, కొత్త వ్యక్తులు ప్రవేశించకుండా జాగ్రత్త పడ్డారు. కొవిడ్‌ సోకిన వ్యక్తులను ఆరు బయట గదిలో ప్రత్యేకంగా ఉంచారు.

అధికారులు ఈ గ్రామాల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలూ ముందుకొచ్చాయి. ఈ పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కొవిడ్ రోగులకు అవసరమైన వైద్య సాయం అందించారు. ఆశా కార్యకర్తలు ఉదయం, సాయంత్రం రోగులతో ఫోన్లో మాట్లాడేవారు. ఇలా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో  ప్రస్తుతం ఐదు గ్రామాల్లోని 405 మందీ పూర్తిగా కోలుకున్నారు. ఒక్క  ప్రాణం కూడా పోకుండా కరోనాపై విజయం సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: