కని కరోనా: ఈ లెక్కలు చూస్తే మీరు తప్పకుండా వ్యాక్సీన్ తీసుకుంటారు..!
నిజమే.. కరోనా నుంచి రక్షణ పొందేందుకు టీకా తీసుకుంటున్నప్పటికీ పలువురు వైరస్ బారిన పడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. కరోనా టీకా తీసుకుని కూడా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటోంది. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కేంద్రం ఆ డాటాను విడుదల చేసింది. ఈ లెక్కలు చూస్తే ప్రజలకు టీకాపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది.
ఇంతకీ ఈ లెక్కలు ఏం చెబుతున్నాయంటే.. రెండు డోసుల టీకా తీసుకున్న వారు స్వల్ప సంఖ్యలోనే వైరస్ బారిన పడుతున్నారట. రెండు డోసుల టీకా తీసుకున్న 10 వేల మందిలో కేవలం ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే కొవిడ్ బారిన పడుతున్నారు. ఒకవేళ టీకా తీసుకున్నాక కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ తీవ్రమైన అనారోగ్యం బారిన పడడం లేదు. ఐసీఎంఆర్ విడుదల చేసిన డేటా ప్రకారం భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ఇప్పటివరకు 1.1 కోట్ల మంది తీసుకున్నారు. 93 లక్షల మంది మొదటి డోసు.. 17 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు.
కోవాగ్జిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో 4,208 మంది కొవిడ్ బారిన పడ్డారు. రెండో డోసు తీసుకున్న వారిలో కేవలం 695 మందికి మాత్రమే కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంటే రెండు డోసులు తీసుకున్న వారిలో కొవిడ్ బారిన పడుతున్నవారు 0.04 శాతం మాత్రమే. అంటే పదివేల మంది టీకా రెండు డోసులూ తీసుకుంటే.. కేవలం 3,4 గురికి మాత్రమే వైరస్ వస్తోంది. ఈ నలుగురిలో కరోనా తీవ్రమయ్యే వారు మహా ఉంటే ఒకరు ఉంటారు. అందుకే టీకా తీసుకోవడం తప్పనిసరి.