మహిళనే పెళ్లి చేసుకుంది.. కొడుకులను బలి ఇవ్వబోయింది.. మదనపల్లె తరహా దారుణం..!
అసలేం జరిగిందంటే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా రంగంపాళ్యం రైల్‌నగర్‌కు చెందిన రామలింగం,రంజిత దంపతులు. వీరికి కుమారులు 15 ఏళ్ల దీపక్ , ఆరేళ్ల కిషాంత్ ఉన్నారు. రామలింగం చీరల వ్యాపారం చేసేవారు. తర్వాత ఇందుమతి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా అదే ప్రాంతంలో తీసుకొచ్చి వేరే ఇంట్లో ఉంచాడు. ఇందుమతి స్నేహితురాలు ధనలక్ష్మి అప్పుడప్పుడు వీరింటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రంజితతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహాన్ని గమనిస్తూ వచ్చిన రామలింగం మీరిద్దరూ శివుడు, పార్వతిలా ఉన్నారని చెప్పేవాడు.
అప్పటి నుంచి వారు అదే మాయలోకి వెళ్లిపోయారు. చివరకు పిచ్చి ఎంతగా ముదిరిందంటే.. కొన్నాళ్లకు తాము పెళ్లి చేసుకుంటామని రంజిత, ధనలక్ష్మి చెప్పేశారు. ఇందుకు రామలింగం కూడా అంగీకరించాడు. తన ఇంట్లోనే తన కుమారుల ఎదుటే వారికి వివాహం చేశాడు. ఆ తర్వాత అతీతశక్తులు వస్తాయనే నమ్మకంతో ధనలక్ష్మిని నాన్న అని, రామలింగాన్ని మామ అని పిలవాలని కుమారులను చిత్రహింసలకు గురి చేశారట.
అంతేకాదు.. అతీత శక్తుల కోసం చివరికి ఇద్దరు పిల్లలను నరబలి ఇచ్చేందుకు రామలింగం, రంజిత, ధనలక్ష్మి యత్నించారట. ఈ విషయం గమనించిన పిల్లలు తాత ఇంటికి పారిపోయి జరిగిన విషయాన్ని చెప్పారు. తాత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగితే వీరి విషయం వెలుగు చూసింది. పిల్లలు మేల్కొనకపోతే.. మరో మదనపల్లె ఘటన మళ్లీ జరిగేదే.