పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కు డిల్లీ అధిష్టానం నుండి పిలుపురావడంతో డిల్లీ వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కాగా ఎందుకోసం డిల్లీకి వెళ్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాలో మార్పులు, చేర్పులుంటాయా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఎట్టి పరిస్థితిలో ముఖ్యమంత్రిని, పిసిసి చీఫ్ ను మార్చేదిలేదని కాంగ్రెస్ అధిష్టానం చెబుతుండగా మరో ప్రక్కన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవిని అప్పగించి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయా అనేది చర్చగా మారింది. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంత నాయకుల్లో చర్చజరుగుతుంది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించే విషయంపై కేంద్రం ఏదైనా ఆలోచిస్తుందా అనే విషయంలో కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చజరుగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారధిగా వ్యవహరించినటువంటి డిఎస్ తనకప్పగించినటువంటి పదవికి న్యాయం చేశారు. అంతేకాదు ఆయన పదవిలో ఉండగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన డిఎస్ కు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే తెలంగాణ ఉద్యమ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చుననే విషయంలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి, పిసిసి పదవులిచ్చిన ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తెలంగాణ కోసం పోరాటం సాగుతూనే ఉంటుందని తెలంగాణ ఎంపిలు తెలియజేస్తున్నారు. కాగా ఇటువంటి పరిస్థితిలో డిఎస్ డిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఏం జరుగనుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: