టిడిపి టార్గెట్ గా టిఆర్ఎస్ పయనం

Kuthuru Raji Reddy
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే ముందుచూపుతో టిఆర్ఎస్ పయనిస్తున్నట్లు పరిస్థితులనుబట్టి తెలుస్తుంది. టిడిపిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ అనేక విమర్శలు చేస్తుంది. తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి చేర్పించుకునేందుకు చెయ్యని ప్రయత్నాలు లేవు. ఇప్పటికే అనేకమంది టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరిపోగా మరికొంత కోసం మంది కోసం గాలం వేసి కూర్చుంది. పాదయాత్ర సందర్భంగా టిడిపి నాయకుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎటువంటి పథకాలను అమలు చేస్తారో, ఎటువంటి అభివృధ్ది చేస్తారో ప్రజలకు వివరిస్తుండగా టిఆర్ఎస్ నాయకులు వాటిని వెంటనే ఖండించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు పాదయాత్రను టిఆర్ఎస్ నాయకులే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని ప్రతిరోజు టిఆర్ఎస్ నాయకులు అదే పనిగా ప్రచారం చేస్తుండగా ఇటువంటి ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో అనేది వారికే తెలియాలి. అంతేకాదు తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని మొదట్లో కొంతబెదిరించే ప్రయత్నం చేసినప్పటికిని టిఆర్ఎస్ ఆవిషయంలో సక్సెస్ కాలేకపోయింది. ప్రజలే సభలకు హాజరైనప్పుడు ఎవరేమిచేస్తారుగాని అక్కడక్కడ మాత్రం టిఆర్ఎస్ నాయకులు బాబు పాదయాత్రను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు టిడిపి తిప్పికొట్టింది. తెలంగాణ ప్రాంతంలో అనేకమంది టిడిపి ఎమ్మెల్యేలున్నారు. ఇటువంటి సందర్భంలో టిఆర్ఎస్ నాయకులు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో పాదయాత్ర చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో చంద్రబాబు పాదయాత్రలు విజయవంతమైతే టిడిపి ఎమ్మెల్యేలతోపాటు క్యాడర్ మరింత బలంగా తయారై టిఆర్ఎస్ చేస్తున్నటువంటి చేర్చుకునే ప్రయత్నాలు విఫలమవుతాయనే ముందుచూపుతో ఎప్పటికప్పుడు ఎవరికి సాధ్యమైనంతగా వారు టిడిపిపై విమర్శలు చేయాలని టిఆర్ఎస్ నిశ్చయించుకొని ఆ దిశగా పయనిస్తుంది. కాగా ప్రతిరోజు టిఆర్ఎస్ టిడిపిపై చేసేటువంటి విమర్శలు కొన్ని రోజులపాటు ప్రజలు ఆసక్తిగా గమనిస్తుండవచ్చుగాని, తర్వాత అదే ప్రజలు టిఆర్ఎస్ టిడిపిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కూడా భావించే అవకాశముంది. ఇంకొంచెం లోతుకు వెళ్లితే గడిచిన ఎన్నికల్లో టిఆర్ఎస్, టిడిపితో పొత్తు ఎందుకు పెట్టుకుందోననే విషయంలో కూడా ప్రజలు ఆలోచించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: