డీలా పడుతున్న పార్టీ శ్రేణులకు ఉత్తేజం నింపే పనిచేసారు కేసిఆర్. ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారన్న అపవాదును దూరం చేసుకునే ప్రయత్నం చేసారు. ఎన్నికలే లక్ష్యంగా అందులో విజయానికి ఉద్యమాన్నే ఆయుధంగా వాడుకునే దిశగా మేథోమథనం లో మంత్రాంగం రచించారు. చేయబోయే వాటిని వివరించారు, చేయాల్సిన దానిపై దిశానిర్దేశం చేశారు. తనపై ఉన్న ఆరోపణలన్నింటికి ఒకే మాటతో సమాధానం చెప్పారు.
కాంగ్రేస్ మోసం చేసింది అన్న ఒక్కమాట కేసిఆర్ ను ఆపార్టిశ్రేణులు అడగాలనుకున్న సవాలక్షప్రశ్నలకు సమాధానమిచ్చింది. కాంగ్రేస్ లో విలీనం, ఉద్యమాన్ని వీడి ఢిల్లీలో గడపడం, జేఏసి తో దూరంగా ఉండడం ఇవన్నీ కూడా తెలంగాణ కాంగ్రేస్ ఇస్తుందని నమ్మబలకడంతో చేసానని, చివరకు అది మోసం చేసింది, ఇక తడాఖా చూపుతాం అంటూ మదిని తొలుస్తున్న సందేహాలకు సమాధానమిచ్చారు కేసిఆర్.
పరిగి, సూర్యపేటల్లో బహిరంగసభలు, 29న దీక్షాదివస్, ఆతర్వాత 40 రోజులపాటు పల్లెబాట వంటి వాటిని రూపొందించి పార్టీ శ్రేణులకు చేతినిండా పని అప్పగించారు. పనిచేయని వారిని హెచ్చరించారు. దీనికి భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే రూట్ క్లియర్ చేసే పనిచేసారు. ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చిన వారికి పెద్దపీఠ వేస్తూ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని పక్కన బెడుతున్నారన్న అపవాదు మొదటి నుంచి కేసిఆర్ పై ఉంది. ఆపని మున్ముందు చేయాల్సి ఉంది, అందుకే పనిచేయడం లేదనే నెపంతో అలాంటి వలసలు వచ్చే ప్రాంతాలనేతలకు చురకలంటించారు.
కాంగ్రేస్, టిడిపిలనుంచి ఓపాతిక మంది ఎమ్మేల్యేలు, ఎంపీలే వస్తున్నారని బాంబు పేల్చారు. వీరిని సర్దుబాటు చేసుకోవాలని హితవు పలికారట. ఈమాటల ద్వారా కాంగ్రేస్, టిడిపిలకు ధడపుట్టించే పని కూడా చేసారన్నమాట. ఇవన్నీ తెలంగాణ సాధనకోసం అంటే మాత్రం తెలివున్న వాడెవడైనా పకపకానవ్వాల్సిందే. వలసలు, పల్లెబాటలు, నాయకులను పటిష్టం చేయడం అంటే ఎవరైనా ఎన్నికల్లో గెలుపుకోసం చేసే పనులనే అంటారు. కాని కేసిఆర్ మాత్రం ఇవన్నీ తెలంగాణ సాదనకోసం ఉద్యమరూపాలు అని సెలవిచ్చారు. ఇలా రెండురోజుల మేథోమథనం డిక్లరేషన్లన్ని మొదటిరోజే పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన రెండోరోజు వాటన్నింటిని మమ అన్పించి బాహ్యప్రపంచానికి చెపుతారన్న మాట.
మరింత సమాచారం తెలుసుకోండి: