జగన్‌.. ఇల్లు కదలకుండా రాష్ట్రమంతా ఎలా గెలిపించాడు..?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో పట్నం ఓటర్ల తీర్పు అంచనాలకు అందకుండా ఉంది. ప్రాంతం, వర్గం, వయస్సు.. అన్నింటికీ అతీతంగా జనమంతా జగన్‌ కు జైకొట్టిన తీరు విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీని జగన్ విజయం దిశగా నడిపించిన తీరు విశ్లేషణకు కూడా అందకుండా ఉంది. ఇప్పటికే రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్.. జనం మద్దతు తనకు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడని చెప్పాలి. అంతే కాదు.. అసలు రెండేళ్లనాటి అసెంబ్లీ ఎన్నికల్లోనే 175 స్థానాలకు 151 స్థానాలు గెలుచుకుని అదే అత్యుత్తమ స్కోరు అనిపించిన జగన్.. ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా ఫలితాలు సాధించడం విశేషమే.


అందులోనూ ఈ ఎన్నికల్లో జగన్ ఎత్తుగడలు, పార్టీని నడిపించిన తీరును ప్రత్యేకంగా పేర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే.. ప్రతిపక్షం నుంచి చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ వంటి వారంతా అన్నిచోట్లా జోరుగా ప్రచారం సాగిస్తే.. జగన్ మాత్రం కేవలం తాడేపల్లికే పరిమితం అయ్యారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించి పర్యవేక్షణ మాత్రమే చేశారు. కనీసం ఒక్కటంటే ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. జగన్ అసలు ప్రచారానికి వెళ్లకపోవడం అతి ఆత్మవిశ్వాసంగా కూడా కొందరు విశ్లేషకులు భావించారు. అసలు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలైతే అందుకు అదే ప్రధాన కారణంగా కూడా చెప్పేవారు.


కానీ.. తాడేపల్లి కదలకుండా ప్రచారానికి వెళ్లకుండా ఈ స్థాయి విజయం సాధించడం గొప్ప విజయంగానే భావించాలి. ఇక విపక్షం చెబుతున్నట్టు ఇది అధికార, ధన బలంతో సాధించిన విజయం అని చెప్పడానికి కూడా లేదు. అదే నిజం అనుకున్నా.. ప్రజలను బెదిరించి, ప్రలోభపెడితే.. ఈ స్థాయి విజయం సాధ్యం కానే కాదు.. అన్నిచోట్లా, అందరినీ బెదిరించడం సాధ్యమయ్యే పని కాదు.. ఆ విమర్శలో అంతగా పస కనిపించదు.


మరి ఇంతగా జగన్‌కు విజయం కట్టబెట్టిందేమిటి.. అమరావతి, విశాఖ ఉక్కు వంటి అంశాలు సైతం ఎలాంటి ప్రభావం చూపించిన దాఖలాలు లేవు. ఇందుకు కారణంగా ఒక్కటే చెప్పుకోవచ్చు. చెప్పింది చేయడం.. సంక్షేమ పథకాల అమలు తీరు ప్రజల మెప్పు పొందడమే కారణంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే అజేయుడిగా కనిపించిన జగన్ ఇక ఈ ఎన్నికలతో తిరుగులేని నేతగా మరోసారి నిరూపించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: