ఏపీలో ఆ ఎన్నికలపై పార్టీల ప్రభావం శూన్యం..

Deekshitha Reddy
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావం శూన్యం అని మరోసారి రుజువు కాబోతోంది. సహజంగా ఈ ఎన్నికల్లో ఆయా ఉద్యోగ సంఘాల తరపున బరిలో దిగే నేతలే గెలుపొందుతారు. అందులోనూ రాజకీయ పార్టీల ప్రభావం వారిపై ఉండదు. స్వతంత్ర అభ్యర్థులుగా లేదా, పీడీఎఫ్ పార్టీ తరపున వారు పోటీలో ఉంటారు. సహజంగానే వారికి వామపక్షాల మద్దతు ఉంటుంది. ఇక ఈ దఫా కూడా ఏపీలోని రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రభావం శూన్యం అని తేలిపోయింది.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ జరగుతుంది. ఈనెల 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాము సూర్యారావు ఈదఫా పోటీనుంచి విరమించుకున్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థిగా యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షాబ్జీ పోటీలో ఉన్నారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌-1938 సంఘాల మద్దతు ఆయనకు ఉంది. రిటైర్డ్ టీచర్ గంధం నారాయణరావు ఎస్టీయూ, పీఆర్టీయూ సంఘాల మద్దతుతో బరిలో ఉన్నారు. రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఆయనకు బంధుత్వం ఉంది. చెరుకూరి సుభాష్ ‌చంద్రబోస్ ‌కు టీడీపీ మద్దతిస్తోంది. వీరు కాకుండా స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. మొత్తం 11మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఎ.ఎస్‌.రామకృష్ణ మరోసారి బరిలో నిలిచారు. ఆయనకు టీడీపీ, ఆక్టా సంఘాల మద్దతు ఉంది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పీడీఎఫ్‌ మద్దతుతో పోటీలో దిగారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌-1938ల మద్దతుంది. ఏపీటీఎఫ్‌-257 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ కు డీటీఎఫ్‌ మద్దతిచ్చింది. గాదె వెంకటేశ్వరరావు అనే అభ్యర్థికి జనసేన మద్దతిచ్చింది.

ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: