ఈ వేసవిలో ఏసీ కొనాలనుకుంటున్నారా..? అయితే త్వర పడండి
ముడిసరకుల ధరలు పెరగడమే కారణం..
ఏసీల తయారీలో వాడే కాపర్, స్టీల్, ప్లాస్టిక్ ధరలు కరోనా లాక్ డౌన్ తర్వాత అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు కంప్రెసర్ ల ధరలు కూడా భారీగా పెరిగాయి. మన దేశంలో తయారయ్యే ఏసీలకు కూడా కంప్రెసర్ల కోసం దిగుమతులపై ఆధారపడాల్సిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఏడాది ఒక్కో ఏసీపై రూ.1,500–2,000 వరకు ధర పెంచాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పటికీ ముడి సరకుల ధరలు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ధరలు మరోసారి పెంచడం తప్పదని అంటున్నారు కంపెనీల ప్రతినిధులు. ఎల్జీ, శాంసంగ్, లాయిడ్ హయర్ సహా.. ఇతర కంపెనీలు కూడా రేట్లను పెంచుతున్నాయి.
ఈసారి వేసవిలో ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. కొత్త కస్టమర్లు, పాత వాటిని ఎక్స్చేంజ్ చేసి తీసుకునేవారు, పాతవాటిని తీసేసి, కొత్తగా తీసుకునేవారు ఎక్కువగా ఉంటారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆఫీస్ లు, ఇతర సముదాయ ప్రాంతాల్లో మాత్రం ఏసీల డిమాండ్ పెరిగే అవకాశం కనిపించడంలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా ఉండటంతో ఆఫీసుల్లో ఏసీలకు అవకాశమే లేదు. అదే సమయంలో ఇంట్లో ఉండి పని చేసుకునేవారంతా.. తమ అవసరాలకోసం ఏసీలు కొనాల్సిన పరిస్థితి.
గతేడాది నిల్.. ఈ ఏడాది ఫుల్..
లాక్ డౌన్ కారణంగా గతేడాది ఏసీల మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. అమ్మకాలు, కొనుగోళ్లు లేవు, ఎక్కడికక్కడ పాత స్టాక్ నిలబడిపోయింది. ఆ స్టాక్ అంతా ఈ మధ్య గ్యాప్ లో వదిలించేసుకున్నారు. ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చే సరికి రేట్లు పెరిగిపోయాయి. ముడి సరకుల రేట్లు పెరగడంతో అనూహ్యంగా రేట్లు పెంచాల్సి వచ్చింది. ఇప్పటికీ ముడి సరకుల రేట్లు పెరుగుతూనే ఉంటడంతో.. మరోసారి కూడా ఏసీల రేట్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఏసీలు కొనాలనుకునేవారు కాస్త తొందరపడటం మంచిదని మార్కెట్ వర్గాలంటున్నాయి.