పుర పోరు: బెజ‌వాడ క‌ష్టం సార్‌.. వైసీపీ నేత‌ల నిర్వేదం... అప్పుడే గుస‌గుస‌!

VUYYURU SUBHASH
వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఒక‌టి ఆశిస్తే.. క్షేత్ర‌స్థాయిలో మ‌రొక‌టి జ‌రుగుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో వైసీపీని ప‌రుగులు పెట్టించి.. త‌న ప్ర‌బుత్వానికి ఎదురు లేద‌ని నిరూపించుకునేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌కు.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌ను రెఫెరెండంగా భావిస్తున్నారు. పైకి ఈ విష‌యం చెప్ప‌క‌పోయినా.. లోలోన మాత్రం ఇదే ఆలోచ‌న సాగుతోంది. ఈ క్ర‌మంలో మూడు రాజ‌ధానులకు అనుకూలంగా విజ‌య‌వాడ‌, గుంటూరు కార్పొరేష‌న్ల‌లో గెలుపును నిర్ణ‌యించుకున్నారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న పార్టీ నేత‌ల‌తోనూ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెప్పుకొచ్చారు. దీంతో తొలుత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. త‌ర్వాత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు విజ‌య‌వాడ‌, గుంటూరు ప‌రిస్తితుల‌పై నివేదిక‌లు సిద్ధం చేశారు. గుంటూరులో ఫ‌ర్వాలేదు అనుకున్నా.. విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంద‌న్న‌ది వారి నివేదిక‌ల సారాంశం. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌ను మ‌రింత గ‌ట్టిగా తీసుకుని ప్ర‌చారం చేయాల‌ని.. వైసీపీని ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి తీసుకురావాల‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో జ‌గ‌న్ హెచ్చ‌రించారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి కొడాలి నాని, పేర్ని నాని.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటూనే విజ‌య‌వాడ‌పై నిత్యం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. వాస్త‌వానికి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా టీడీపీలో విజ‌య‌వాడ నేత‌లు క‌య్యాలు ప‌డుతున్నారు. ఇది త‌మ‌కు లాభిస్తుంద‌ని వైసీపీ నాయ‌కులు భావించారు. అయితే.. అనూహ్యంగా ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు చంద్ర‌బాబు.. నేత‌ల‌ను సెట్ రైట్ చేశారు.

దీంతో ఇప్పుడు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా టీడీపీని కార్పొరేష‌న్‌లో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇది వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. మ‌రోవైపు.. వైసీపీలో మంత్రులు బాధ్య‌త తీసుకున్నా.. క్షేత్ర‌స్థాయిలో రేష‌న్‌.. స‌హా ఇళ్ల ప‌ట్టాల పంపిణీ వంటివి విజ‌య‌వాడ‌లో స‌క్ర‌మంగా సాగ‌లేదు. ఇది వ్య‌తిరేక గాలులు వీచేలా చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ క‌ష్టం సార్! అంటూ.. వైసీపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: