వైఎస్ షర్మిలారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి.. ముదురుతున్న డైలాగ్‌వార్..?
ఇదే సమయంలో పెద్దగా పార్టీలో నాయకులు లేకపోయినా.. అప్పుడే రాజకీయ విమర్శలకు ఘాటుగానే బదులిస్తున్నారు. ఇప్పటికే షర్మిల పార్టీపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు షర్మిల పార్టీ నేతలు వాటిని తిప్పికొడుతున్నారు. మరోవైపు షర్మిలపై వివిధ పార్టీల నేతలు చేస్తున్న రాజకీయ విమర్శకులకు షర్మిల అనుచరులు కౌంటర్ వేయడం ప్రారంభించారు. ఇటీవల సమ్మేళనంలో ఒక విద్యార్థిని షర్మిల ఓదార్చడంపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ మండిపడ్డారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.
షర్మిల రాజకీయంగా ఎదుగుతుండడాన్ని రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని షర్మిల పార్టీ నేత తూడి దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. షర్మిలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఎన్ని రోజుల క్రితం చేరారో అందరికీ తెలుసని తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులతో సమ్మేళనంలో ఒక విద్యార్థి తండ్రిని కోల్పోయానని బాధ పడితే షర్మిల ఓదార్చారని, దానికి రాజకీయ రంగు పులుముతున్నారని తూడి దేవేందర్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రోజులు లేవన్న తూడి దేవేందర్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి పేరును రేవంత్ వాడుకోవాలని అనుకున్నారని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డిని గతంలో దూషించి ఇప్పుడు కాంగ్రెస్‌లో పొగుడుతున్నారంటూ తూడి దేవేందర్ రెడ్డి విమర్శించారు. మొత్తానికి తెలంగాణలో షర్మిల మొదటగా రేవంత్ రెడ్డి నుంచే ఘాటు విమర్శలు ఎదుర్కొన్నారు. షర్మిల పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డి విమర్శలకు గట్టిగా బదులిస్తున్నారు.